ఎన్నికల్లో మేమంతా నోటాకే ఓటేస్తం

  • ఎమ్మెల్యేలు, ఎంపీలు చోద్యం చూసిండ్రు
  • కార్పొరేటర్లు కానరాలె..అధికారులు ఆదుకోలె
  • సిటీలో ముంపు బాధితుల ఆవేదన

హైదరాబాద్, వెలుగు‘వరదలొస్తె ఒక్కరు రాలె. ఓట్ల కోసం వస్తుండ్రు. మేం మనుషులం కాదా? మా ప్రాణాల కంటే ఓట్లే ముఖ్యమా? కంటిముందు మనుషులు కొట్టుకుపోతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికినం. అన్ని వదులుకుని కట్టుబట్టలతో బయటపడ్డం. వారం పదిరోజులు నీళ్లలన్నే ఉన్నం. కళ్ల ముందు బతుకులు ఆగమైనా ఒక్కరు పట్టించుకోలె. ఈసారి మేం ఎవరికీ ఓటువెయ్యం. ఓట్లు ఎలా అడుగుతారో చూస్త.’ ఇదీ సిటిలోని వరద బాధితుల ఆవేదన. భారీ వర్షాల వల్ల సర్వం కోల్పోయిన తమను ఆదుకోడానికి ఏ ఒక్కరూ రాలేదని, ఓట్ల కోసం మాత్రం వస్తున్నారని, తాము ఎవరికీ ఓటు వేయమని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

వరద తాకిడికి సిటీ చుట్టుపక్కల చెరువులు కట్టలు తెంచుకున్నాయి. నాలాలు పొంగి ఇండ్లను ముంచేశాయి. నాగోల్​లోని అయ్యప్ప కాలనీ, మల్లికార్జున నగర్, త్యాగరాయనగర్ కాలనీ, బండ్లగూడ, మెట్టుగూడ, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలోని హనుమాన్ నగర్ కాలనీ, మీర్ పేట్ లోని మిథులానగర్, సత్యనారాయణ నగర్, చంద్రయాణగుట్ట, ఉప్పల్, ఫలక్ నుమా లోని అల్ జుబైల్ కాలనీ, సయ్యద్ బాబా నగర్, టోలీచౌకి, నదీంకాలనీ, షేక్ పేట్ లోని అక్బర్ పురా కాలనీ, షేక్ పేట్ నాలా, మహాత్మా గాంధీ నగర్ వంటి దాదాపు 800 కాలనీలు జలమయం అయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 50 మందికి పైగా చనిపోగా.. సుమారు లక్ష మంది వరకు నిరాశ్రయులయ్యారు. రెండు వారాలకు పైగా నీటిలోనే ఉన్నారు. నెల రోజులుగా కరెంటు, మంచి నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. ఇలాంటి పరిస్థితిలో ఏ ఒక్కరూ తమను ఆదుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందరి నోటా అదే మాటా..

వరదల సమయంలో రాని నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని బాధితులు చెబుతున్నారు. తాము సమస్యల్లో ఉన్నప్పుడు ఆదుకోని లీడర్లకు ఓటు ఎందుకు వేయాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద సాయంలోనూ కమీషన్లు కాజేసిన వారికి ఓట్లు ఎలా వేయాలని ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయమని, నోటాకే తమ ఓటు అంటూ నినదిస్తున్నారు. నెల రోజులుగా గాలిలో దీపంలా దుర్భర స్థితిలో బతికామని, ఒక్కరు కూడా వచ్చి ఎలా ఉన్నారు అని అడగలేదని చెబుతున్నారు. కార్పొరేటర్ల నుంచి మొదలు మంత్రుల వరకు ఎవరూ పట్టించుకోలేదన్నారు. కేవలం టీవీలు, పేపర్లలో ఫొటోల కోసమే వచ్చి, ఒక్క నిమిషం కూడా ఉండకుండా వచ్చి పోయారని ఆరోపిస్తున్నారు. లక్షల్లో నష్టం వస్తే ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇచ్చిందని, అవి కూడా ఇంకా చాలా మందికి రాలేదని చెబుతున్నారు. వరదల్లో నష్టపోయి శోకసంద్రంలో ఉంటే ఆన్​లైన్​ లో అప్లై చేసుకోవాలంటూ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టిందన్నారు.

నీటిలోనే హనుమాన్​నగర్

నాగోల్ సమీపంలోని హనుమాన్ నగర్ కాలనీ నేటికీ నీళ్లలోనే ఉంది. ప్రస్తుతం 25 ఇండ్లు వరద నీటిలోనే ఉన్నాయి. కాలనీవాసులు ఎక్కడికి వెళ్లే దిక్కులేక ఇంటిపై టెంట్లు వేసుకుని బతుకుతున్నారు. బయటకు పోయి బతకాలంటే ఇంటి కిరాయిలు, సామాన్లు కొనలేని పరిస్థితిలో ఉన్నామని, జీవనాధారాలు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మురుగునీరు, దోమల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని, ఇప్పటికైనా కనికరించి నీటిని క్లియర్ చేయాలని కోరుతున్నారు.

ఎందుకెయ్యాలె ఓట్లు?

ఎందుకు ఎయ్యాలే ఓట్లు? మమ్మల్ని బురదలో వదిలేసి, వాళ్లు ఏసీ రూంలలో ఉంటున్నందుకా? మేం ఇంకా నీళ్లల్లోనే ఉన్నం. బయటకు పోయేందుకు దారిలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు రానోళ్లు ఓట్లప్పుడు వస్తున్నరు. మా ప్రాణాల కంటే ఓట్లే వాళ్లకు ముఖ్యమైనయ్. నేను జనాభా లెక్కల్లో లేకున్నా పర్లేదు. కానీ ఓటు మాత్రం వేయను.

– అశోక్​ కుమార్​ ,డైలీ లేబర్,​ ఓల్డ్​ కమేలా, బషీర్​బాగ్​

ఎన్ని ఇబ్బందులు పడ్డమో..

వరదలప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డమో మాకు తెలుసు. ఇంట్ల సామాన్లన్నీ కొట్టుకుపోయినయ్. నా బైక్ మొత్తం కరాబైంది. 50 రోజులుగా ఇబ్బంది పడుతున్నా . వారం క్రితమే చెత్త క్లీన్ చేశారు. ఎవరు పట్టించుకున్నరని ఓట్లు వెయ్యాలే. మా ఇంట్లో నాలుగు ఓట్లున్నయ్. మొత్తం నోటాకే వేస్తం. ఓట్లు అడగానికి వస్తే తలుపులేసుకుంటం. మా బాధలు పట్టని వాళ్లని మేమేందుకు గెలిపిస్తం.  –  అజ్మత్,అల్ జుబైల్ కాలనీ

ఎట్లున్నరని చూడలే..

వరదలొచ్చి కాలనీలు ఆగమైనా ఏ  నాయకుడు ఇటు వైపు చూడలేదని బాధితులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు దూరం నుంచే చూసి వెళ్లారే తప్ప తమ గోడును వినిపించుకోలేదన్నారు. సామాన్లు కొట్టుకుపోయినా, ఇండ్లు పాడైపోయినా ఎవరూ సాయం చేయలేదన్నారు. వరద తగ్గాక తమకు తామే శుభ్రం చేసుకున్నామని తెలిపారు. రోడ్లపై పేరుకుపోయిన బురద, చెత్తను తొలగించడంలో జీహెచ్​ఎంసీ సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. వివిధ ఫౌండేషన్లు, ఎన్జీవోలే తమను కాస్తోకూస్తో ఆదుకున్నాయని, ఏ ఒక్క లీడర్ కూడా రాలేదని వివరిస్తున్నారు. లక్షల్లో నష్టం వాటిల్లితే రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పారు. వచ్చిన పదివేలల్లో టీఆర్ఎస్​నాయకుల కమీషన్లకే సగం పోయాయని తెలిపారు. ప్రభుత్వ శిబిరాల్లో పాచిపోయిన అన్నం పెట్టారని, కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో ఉంచలేదన్నారు. కానీ ఎన్నికలు రాగానే నాయకులు తమ ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని చెబుతున్నారు.