ఎటు చూసినా బురదే .. ఖమ్మంలో సర్వం కోల్పోయిన వరద బాధితులు

ఎటు చూసినా బురదే .. ఖమ్మంలో సర్వం కోల్పోయిన వరద బాధితులు
  • ఏ కుటుంబ పరిస్థితి చూసినా వర్ణనాతీతమే..
  • ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మంటౌన్/మణుగూరు/నెట్​వర్క్, వెలుగు : ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. రాత్రికిరాత్రి ముంచిన వరదతో ప్రాణాలను దక్కించుకునేందుకు సహాయ కేంద్రాలకు తరలివెళ్లారు. రెండ్రోజుల తర్వాత ఇండ్లకు చేరిన బాధితులకు ఇండ్లన్నీ బురదయమంగా కనిపించాయి. సర్వం కోల్పోయి కంటతడి పెట్టుకున్నారు. మున్నేరు పరివాహక కాలనీలు, కవిరాజ్ నగర్ తో పాటు నగరంలోని దాదాపు 30 కాలనీలకు చెందిన 2వేల కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. కొన్నేళ్లుగా కూడబెట్టుకున్న డబ్బులతో కొనుక్కున్న వస్తువులతో పాటు, వంట సామగ్రి, నిత్యావసరాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి.

మిగిలినవి పాడయ్యాయి. ఇండ్లలో మొండిగోడలు, బురద పట్టిన బట్టలు దర్శనమిస్తున్నాయి. ఏ కుటుంబ పరిస్థితి చూసినా వర్ణనాతీతంగానే ఉంది. కనీసం ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరులోనూ అదే పరిస్థితి ఉంది. మణగూరుతోపాటు జూలూరుపాడు, పాల్వంచ, బూర్గంపహాడ్​ ప్రాంతాల్లో 984 మంది రైతులకు సంబంధించి దాదాపు 2,982 ఎకరాల్లో పంట నష్టం కలిగింది.

Also Read :- ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో దెబ్బతిన్న కల్వర్టులు.. తెగిన రోడ్లు 

1,647 ఎకరాల్లో వరి, 1,323 ఎకరాల్లో పత్తితోపాటు ఇతరత్రా పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు రూ. 2కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. విద్యుత్​ శాఖకు దాదాపు రూ. 20 నుంచి రూ. 25లక్షల మేర నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్​, ఆర్​ అండ్​ బీ శాఖలకు సంబంధించిన అప్రోచ్​ దారులు, రోడ్లు దెబ్బతినడంతో దాదాపు రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది. ఇవే కాకుండా ఇరిగేషన్​కు శాఖకు సంబంధించిన పలు చెరువు కట్టలు దెబ్బతిన్నాయి.  ఆయా శాఖల అధికారులు వాటిల్లిన నష్టంపై అంచనాలు వేస్తున్నారు. కాగా తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.