భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లా అతలాకుతలం..ప్రాజెక్టు గేట్లపై వరద నీరు

భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లా అతలాకుతలం..ప్రాజెక్టు గేట్లపై వరద నీరు
  •     ఉప్పొంగిన పెద్దవాగు     
  •     వరదలో చిక్కుకున్న 20మంది పశువుల కాపర్లు    
  •     హెలికా ప్టర్ల ద్వారా రెస్క్యూ చేసిన ఆఫీసర్లు 
  •     అశ్వారావుపేటలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం
  •     కిన్నెరసాని, తాలిపేరు, పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు
  •     రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వానలు

భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు : కుండపోత వర్షాలతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  అశ్వారావుపేట నియోజకవర్గంలో గురువారం15సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ఉధృతి పెరిగి పెద్దవాగు ప్రాజెక్ట్ ప్రమాదపుటంచున నిలిచింది. వాగులోని కట్టమైసమ్మ టెంపుల్ ప్రాంతంలో 20 మంది పశువుల కాపర్లు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్ల సాయంతో, తెలంగాణ, ఏపీకి చెందిన రెండు హెలీకాప్టర్ల ద్వారా రెస్క్యూ చేయించారు. వానలతో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లోని ఓపెన్​కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.

20వేల టన్నులకు పైగా ప్రొడక్షన్​ నిలిచిపోయింది. మరోవైపు గురువారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ముసురు అందుకుంది. గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలుంటాయని హెచ్చరించిన వాతావరణశాఖ పది జిల్లాల్లో రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్​ వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఓపెన్​చేసి, 26,1795 క్యూసెక్కులను రిలీజ్​ చేస్తున్నారు. దీంతో  పేరూర్ వద్ద రాత్రి 10గంటలకు 11మీటర్ల  మేర వరద ప్రవహిస్తుంది. ఎగువన ఛత్తీస్​గఢ్​ నుంచి  భారీగా వరద నీరు వస్తుండడంతో గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు  చెప్తున్నారు. 

సురక్షిత ప్రాంతాలకు తరలింపు...

అశ్వారావుపేట మండలంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు సుమారు  15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పెద్దవాగు ప్రాజెక్ట్​లోకి వరద పెరిగి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇరిగేషన్​ఆఫీసర్లు మూడు గేట్లు ఎత్తేందుకు యత్నించగా, రెండు తెరుచుకోగా మరొకటి సతాయించింది. కొద్దిసేపటికి ఎలాగో దాన్ని కూడా తెరవగలిగారు. మరో వైపు ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతుండడం, గేట్లపై నుంచి, కట్ట పై నుంచి వరద ప్రవహిస్తుండడంతో కట్టకు ఎప్పుడు గండి పడ్తుందోనని ఆఫీసర్లు, పరిసర ప్రాంత ప్రజలు భయపడుతున్నారు.

1989లో భారీ వరదలతో పెద్దవాగు కరకట్టకు గండిపడగా కమ్మరి గూడెం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం అప్పటి పరిస్థితిని తలపిస్తుండడంతో అంతా కలవరపడుతున్నారు. దీంతో లోతట్టు గ్రామాలైన కోయ రంగాపురం, వడ్డె రంగాపురం, కమ్మరిగూడెం, ఏపీలోని అల్లూరి సీతారాంనగర్​, మేడిపల్లి, మాదారం గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

32 మందిని కాపాడిన హెలీకాప్టర్లు 

అశ్వారావుపేట మండలం నారాయణపురం సమీపంలోని కట్టమైసమ్మ టెంపుల్​ సమీపంలో వరద నీటిలో ఓ కారు, పశువుల కాపర్లతో పాటు కూలీలు చిక్కుకున్నారు. అందరూ చెట్లు ఎక్కి వీడియోలు తీసుకుని తాము వరదలో చిక్కుకుపోయామని కాపాడాలంటూ పలువురికి పంపారు. ఇదే టైంలో ఏపీలోని వేలేరుపాడు మండలం కోయిదాకు చెందిన డాక్టర్​అనూష కారులో అటుగా వెళ్తూ చెట్లపై ఉన్న వారిని గమనించి ఏపీ ప్రభుత్వానికి, అధికారులకు సమాచారమిచ్చారు. మొత్తం 20 మంది సాయం కోసం ఎదురుచూడగా విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎస్​కు పరిస్థితిని వివరించారు.

దీంతో ఆమె సూచనల మేరకు తెలంగాణ, ఏపీకి చెందిన రెండు హెలీకాప్టర్లు వరదలో చిక్కుకున్న పశువుల కాపర్లను రక్షించాయి. అటువైపు వచ్చిన ఓ కారు కొట్టుకుపోగా, అందులో ఉన్నవారిని ఏపీలోని అల్లూరినగర్ ​ప్రాంత వాసులు రక్షించారు. బచ్చువారిగూడెం బ్రిడ్జిపై చిక్కుకున్న మరో 12 మందిని హెలీకాప్టర్​ ద్వారా కాపాడారు.  పెద్ద వాగు ప్రాజెక్ట్​ వరద ఉధృతిలో దాదాపు 80 మేకలు, 25 పశువులు కొట్టుకుపోయాయి. మరో చోట ఎడ్లబండితో పాటు ట్రాక్టర్​ కొట్టుకుపోయాయి.  మరోవైపు ఏపీలోని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలరాజు తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే క్రమంలో పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఇటువైపే ఆగిపోయారు.

 పెద్దవాగు ప్రాజెక్ట్​ దగ్గర పరిస్థితిని ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు ఎస్పీ బి. రోహిత్​ రాజు పర్యవేక్షించారు. ముల్కలపల్లి మండలంలోని ముత్యాలపాడు వాగు వద్ద గల డైవర్షన్​ రోడ్డు  వరదకు కొట్టుకుపోయింది. జ్వరంతో బాధపడుతున్న 11 నెలల చిన్నారిని ట్రీట్​మెంట్​ కోసం పోలీసులు వాగు  దాటించారు. 

403 అడుగులకు చేరుకున్న కిన్నెరసాని

పాల్వంచ రూరల్ ​: వర్షాలతో పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్​లోకి భారీగా వరద చేరుతోంది. 407 అడుగుల కెపాసిటీ గల రిజర్వాయర్ ​నీటిమట్టం గురువారం సాయంత్రం వరకూ 403.01 అడుగులకు చేరుకుంది. దీంతో డ్యాం సైట్​ అధికారులు 12  గేట్లలో 5 గేట్లను ఎత్తి  25వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. కేటీపీఎస్​ఆఫీసర్లు రామకృష్ణ, సురేశ్ ​పర్యవేక్షించారు. 

రెండు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రాబోయే వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌‌, పెద్దపల్లి, జయశంకర్‌‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మిగితా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్, భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.