నాగార్జునసాగర్​కు పోటెత్తిన వరద

  • 3,22, 812 క్యూసెక్కుల ఇన్​ ఫ్లో 
  • 576  అడుగులకు చేరిన నీటిమట్టం 
  • నేడు ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తనున్న అధికారులు

హాలియా, వెలుగు:  నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నిండడంతో అధికారులు10 గేట్లను 12 ఫీట్లు ఎత్తి 4,27,711 క్యూసెక్కులను నాగార్జునసాగర్​కు  వదులుతున్నారు. దీంతో సాగర్​ నిండుకుండలా మారింది. భారీగా ఇన్‌‌‌‌ఫ్లో వస్తున్న క్రమంలో  సోమవారం ఉదయం 8 గంటలకు డ్యాం అధికారులు గేట్లు ఎత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2 లక్షల క్యూసెక్కులను దిగువకు వదలనున్నారు. ముందుగా కొంత మేర క్రస్ట్ గేట్లు పైకి ఎత్తి ఎగువ నుంచి వచ్చే వరద నీటిని అంచనా వేస్తూ డ్యాంలో లెవెల్​ మెయింటెయిన్​ చేస్తూ ఎప్పటికిప్పుడు వరదను విడుదల చేయనున్నారు.

576.10 అడుగుల కు చేరిన నీటి మట్టం..

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగు లు(312.5050 టీఎంసీలు)కాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 576.10 అడు గుల(271. 9097 టీఎంసీలు)కు చేరుకుంది. ఎడ మ కాల్వకు 4,613  క్యూసెక్కులు, కుడికాల్వకు 5,700 , ఎస్ఎల్ బీసీకి 1,200 , మెయిన్ పవర్ ద్వారా 26,040 క్యూసెక్కులు రిలీజ్​ చేస్తున్నారు. ఇన్​ఫ్లో 3,22,812 క్యూసెక్కులు వస్తుండగా, 37,873 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.  

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

సాగర్​ ప్రాజెక్ట్​ గేట్లను సోమవారం ఎత్తుతున్న నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంత పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, ఎన్టీఆర్​ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అలర్ట్​ గా ఉండాలని నాగార్జున సాగర్​ డ్యాం అధికారులు సూచనలు చేశారు. దీంతో పాటు నల్లగొండ జిల్లా సాగర్ ప్రాజెక్ట్  బ్యాక్​వాటర్ ​నిలిచే  పెద్దవూర, పీఏపల్లి, తిరుమలగిరి(సాగర్​) మండలాల పరిధిలోని నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈత కోసం, బట్టలుతికేందుకు నదిలోకి వెళ్లవద్దని, పశువులను నదిలోకి తీసుకువెళ్లడం, నది దాటే ప్రయత్నం చేయవద్దని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లకూడదని నల్గొండ కలెక్టర్​ సి. నారాయణరెడ్డి సూచించారు. 

పులిచింతలకు చేరుతున్న పోటెత్తిన వరద

మేళ్లచెరువు(చింతలపాలెం)  : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ నుంచి అవుట్ ఫ్లో పెరగడంతో పులిచింతల ప్రాజెక్టుకు 26,657 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో  ప్రాజెక్టులో ప్రస్తుతం 3.61 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అంతకుముందు 0.6 టీఎంసీలు ఉండగా రెండు రోజుల్లో మూడు టీఎంసీలు పెరిగింది.10,199 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.  రెండు రోజుల్లో ఇన్ ఫ్లో మరింత
పెరగవచ్చని ఆఫీసర్ల అంచనా . 

జూరాలకు స్వల్పంగా తగ్గిన వరద

గద్వాల : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్​ల నుంచి వరద తగ్గడంతో ఆదివారం జూరాల ప్రాజెక్టు దగ్గర 31 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాంకు 2,50,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, అంతే మొత్తాన్ని కిందికి వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్​కు 2 లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 2,22,850 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 2,60,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 34 గేట్లను ఓపెన్ చేసి  2,52,987 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు.