తాడ్వాయి/శాయంపేట, వెలుగు: భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండలతోగు, జనగాలంచ వాగు ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డును, మేడారం జంపన్న వాగు ఉధృతిని ఆదివారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీశ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడుతున్నందున ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని, ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని చెప్పారు. వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని, ఆఫీసర్లకు సహకరించాలని సూచించారు.
పకృతి విపత్తు టైంలో రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించాలని, యువత, నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. జనగాలంచవాగు, గుండ్ల వాగు మీద బ్రిడ్జిలను నిర్మిస్తామని చెప్పారు. మండలానికి ఐదుగురు ఆఫీసర్లతో ఫ్లడ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆమె వెంట డీఎంహెచ్‌వో అప్పయ్య, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడిని పరిశీలించారు. ఈ మత్తడిపై త్వరలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. ప్రజలు, వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు.
ఎస్సారెస్పీకి 60,419 క్యూసెక్కుల వరద
నిజామాబాద్/బాల్కొండ, వెలుగు : ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఆదివారం సాయంత్రం నుంచి ఎస్సారెస్పీకి 60,419 క్యూసెక్కుల వరద వస్తోంది. మంజీరా, హరిద్రా నది నుంచి భారీ మొత్తంలో వరద వస్తుంది. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 64 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద కాలువ గేట్లు ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.