గ్రేటర్లో చిన్నపాటి వర్షానికే రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. సెంటీ మీటర్ వర్షానికి కూడామోకాలు లోతు నీళ్లు పేరుకుంటున్నాయి. నగర విస్తరణ, భవన నిర్మాణాలతో వర్షం నీరు సహజ సిద్ధంగా వెళ్లే మార్గాలు దెబ్బతిన్నాయి. డ్రెయిన్‌లు వ్యర్థాలతో నిండటంతో వర్షపు నీరు రోడ్లపైనే ఉంటోంది. సిమెంటు, డాంబరు రోడ్లు కావడంతో భూగర్భంలోకి నీరు ఇంకడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ శాస్త్రీయమైన పద్ధతిలో సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళిక రచించింది. ఈ చర్యలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తోంది. సిటీలో ముంపు సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఇంజక్షన్ బోర్‌వెల్స్‌ను తవ్వుతోంది. వర్షం నీరు ఆ బోర్వెల్స్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షపు నీరు అక్కడికక్కడే భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని బల్దియా భావిస్తోంది.
గ్రేటర్లో భారీ వర్షాలతో ముంపుకు గురయ్యే 160 లొకేషన్లను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. ఆ ప్రాంతాల్లో సమస్య తీవ్రతను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల కమిటీ సూచనలతో ముంపు ప్రాంతాల్లో ఇంజక్షన్ బోర్వెల్స్తవ్వుతున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ కాకతీయ హిల్స్, మెగాహిల్స్ లో దాదాపు 500 ఫీట్ల లోతు వరకు ఇంజక్షన్ బోర్‌వెల్స్‌ను తవ్వుతున్నారు. ముంపు ప్రాంతాల సమీపంలోని ఖాళీ స్థలంలో వీటిని తవ్వుతున్నారు. పరిసర ప్రాంతాల్లోని వరద నీరు అక్కడికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి ఇంకుడు గుంతల తరహాలో నీటిని భూగర్భంలోకి పంపుతాయి. వర్షం పడ్డప్పుడు వరద ముంపు తగ్గడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది.
ఒక్కో బోర్‌వెల్‌కు రూ.2 లక్షలు వ్యయం
ఇంజక్షన్ బోర్వెల్స్లోకి పరిసర ప్రాంతాల్లోని అర కిలోమీటర్ నుంచి వచ్చే వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకే అవకాశం ఉంది. ఒక్కో ఇంజక్షన్ బోర్‌వెల్‌కు సుమారు రూ.2 లక్షలు వ్యయం అవుతుంది. ముంపు ప్రాంతాల నుంచి ఇంజక్షన్ బోర్‌వెల్ వరకు కాలువ తవ్వుతారు. బోర్‌వెల్ భారీ పైపు తరహాలో ఉంటుంది. పైప్ చుట్టూ కింది నుంచి పై వరకు రంధ్రాలు కలిగి ఉంటాయి. బోర్‌వెల్‌లోకి వెళ్లే నీరు అన్ని వైపుల నుంచి భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజక్షన్ బోర్‌వెల్‌ల ద్వారా భూగర్భ జలాలు ఏ మేరకు పెరిగాయనేది వేసవిలో పరీక్షిస్తారు. ఫలితాలను విశ్లేషించి మరిన్ని చోట్ల తవ్వకాలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు.