- తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం
- ట్రైన్లు, ఫ్లైట్ సర్వీసులకు అంతరాయం
- స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- బెంగళూరులోనూ భారీ వర్షం
చెన్నై: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తమిళనాడు రాజధాని చెన్నై, తిరువళ్లూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు కుప్పకూలిపోయాయి. చెన్నైలోని సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం చుట్టూ వరద నీరు చేరింది. రైళ్లు, ప్లైట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మెట్రో రైలు సర్వీసులపై మాత్రం ఎటువంటి ప్రభావం పడలేదు. అవి యథావిధిగా నడిచాయి. ఇండ్లలోకి వరద నీరు వస్తుండటంతో ప్రజలు హోటళ్లను ఆశ్రయించారు. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రజల సౌకర్యార్థం హెల్ప్ లైన్ నంబర్ 1913ని ఏర్పాటు చేసింది. వాతావరణ సూచనల కోసం టీఎన్ అలర్ట్ యాప్‌ను సందర్శించాలని సూచించింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నీట మనిగిన అనేక ప్రాంతాలను పరిశీలించారు. చెన్నై కార్పొరేషన్‌కు చెందిన ఇంటిగ్రెటేడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా సందర్శించారు. అధికారులు చేపడుతున్న సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. అంతకు ముందే సీఎం ఎంకే. స్టాలిన్ విపత్తును ఎదుర్కోవడానికి అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), తమిళనాడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
బెంగళూరులోనూ భారీ వర్షం
కర్నాటక రాజధాని బెంగళూరులో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కాలేజీలు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించింది.