విద్యుత్ పునరుద్ధరణ పనులు స్పీడప్ చేయండి

విద్యుత్ పునరుద్ధరణ పనులు స్పీడప్ చేయండి
  • అంతరాయం లేకుండా కరెంట్ సప్లై చేయాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్​లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ క్రమంలో అధికారులు, సిబ్బందికి ఏ సమస్య వచ్చినా డిస్కమ్ సీఎండీల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ‘‘భారీ వర్షాల నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఎంతో ధైర్యంగా పనిచేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టారు.

వారందరికీ అభినందనలు. క్షేత్రస్థాయిలోని సిబ్బంది వ్యక్తిగతంగా భద్రత చర్యలు తీసుకొని పని చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించాలి’’అని భట్టి అన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న సీఎండీలతో సెక్రటేరియెట్ నుంచి డిప్యూటీ సీఎం మాట్లాడారు. వరదల కారణంగా విద్యుత్ సంస్థకు ఎంత నష్టం వచ్చిందో అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రివ్యూ మీటింగ్​లో ఇంధన శాఖ సీఎండీ రోనాల్డ్ రోస్, జేఎండీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.