బ్యాంకాక్: దక్షిణ థాయిలాండ్, ఉత్తర మలేసియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు దేశాలు దశాబ్దాలలోనే అత్యంత దారుణమైన వరదలను ఎదుర్కొన్నాయి. వరదల ధాటికి పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. శనివారం నాటికి వరదలతో మృతి చెందిన వారి సంఖ్య12కు చేరుకుంది. దక్షిణ థాయిలాండ్‌లో వరదలతో 5.34 లక్షల కుటుంబాలు ప్రభావితమయ్యాయి.
గత మూడ్రోజులుగా పెరుగుతున్న నీటి మట్టాలతో పదివేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాంగ్ ఖ్లా ప్రావిన్స్‌లోని చానా జిల్లా కూడా వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది. వరద నీటి ప్రవాహంలో మునిగిపోయిన ప్రజలను వారి ఇండ్ల నుంచి ట్రక్కుల్లో బయటికి తీసుకువెళ్లారు. మలేసియాపై కూడా వరదల ప్రభావం తీవ్రంగా పడింది. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపుగా 1.39 లక్షల మంది ప్రభావితమయ్యారని నేషనల్ డిజాస్టర్ కమాండ్ సెంటర్ తెలిపింది.