వానలు కురిస్తే జనాలు సంతోషిస్తారు. పంటలు పండుతాయని, కడుపులు నిండుతాయని ఆనందపడతారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ బతకొచ్చని, కూటి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. దేశంలోని అన్ని చోట్లా ప్రజలు ఇలాగే అనుకుంటారు. కానీ.. అస్సాంలోని సోనిత్పూర్ సహా ఏడు జిల్లాల వాసులు మాత్రం వర్షాలంటేనే నిలువునా వణికిపోతున్నారు. వరదలను చూసి బోరుమంటున్నారు. ఏటా పడుతున్న ఈ బాధలు ఎప్పుడు తొలిగిపోతాయా అని ఎదురుచూస్తున్నారు.
భారీ వర్షాలు పడితే వరదలు ఒక్కసారిగా ముంచెత్తుతాయి. వేగంగా, బలంగా దూసుకొచ్చే నీటి ప్రవాహానికి వాగులు–వంకలు, నదులు–కాలువల వెంట ఉండే నేలలు కోతకు గురవుతాయి. పచ్చని పంటలు, నీడనిచ్చే చెట్లు, తలదాచుకునే ఇళ్లు, బతుకుదెరువైన గొడ్డూ–గోదా, విలువైన వస్తువులు అన్నీ కళ్ల ముందే కొట్టుకుపోతాయి. ఒక్కో సారి మనుషుల ప్రాణాలు కూడా దక్కవు. జీవితంలో ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఇలా జరిగితే తట్టుకోగలం. కానీ.. ఏటా ఇవే ఇబ్బందులు తలెత్తుతుంటే బతుకుపైనే విరక్తి పుడుతుంది. భవిష్యత్తు అంధకారమవుతుంది.
ఏయే జిల్లాల్లో?
అస్సాంలోని సోనిత్పూర్, మోరిగావ్, కామ్రూప్, చరాయ్‌డియో, బార్పెటా, ధుబ్రి, దిర్భుగఢ్ జిల్లాలతోపాటు మజులి ఐలాండ్ ఏరియాల్లో వేల మంది ప్రజలు ప్రతి సంవత్సరం వానాకాలంలో వరద బాధితులుగా మిగిలిపోతున్నారు.
నిలువ చోటు లేక, ఉన్న ఊరుని, పుట్టి పెరిగిన నేలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నిజానికి ఫ్లడ్ మేనేజ్మెంట్, సాయిల్ ఎరోజన్ అనేవి స్టేట్ లిస్టులోని ఇష్యూలు. వాటికి సొల్యూషన్ వెతకాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అయినా కేంద్ర ప్రభుత్వం తన వంతుగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తోంది.
ఇప్పటివరకు రూ.1201 కోట్లు విడుదల
11వ ‘ఫైవ్ ఇయర్ ప్లాన్’లో ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్(ఎఫ్ఎంపీ)ని ప్రారంభించింది. రూ.2383.11 కోట్లు ఖర్చయ్యే 141 ప్రాజెక్టులను ఓకే చేసి ఎఫ్‌ఎంపీలో చేర్చింది. ఇందులో 100 పనులను (రూ.996.14 కోట్ల అంచనా వ్యయంతో) 11వ ప్లాన్‌లో ఆమోదించగా అంతకన్నా ఎక్కువ బడ్జెట్ (రూ.1386.97 కోట్ల అంచనా వ్యయం) కేటాయించి 41 ప్రాజెక్టులకు 12వ ప్లాన్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11వ ప్లాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం అస్సాంకు ఎఫ్ఎంపీ కింద రూ.1201.36 కోట్లు విడుదల చేసింది.
మూడు అకౌంట్లలోకి అమౌంట్
యాంటీ–ఎరోజన్ ప్రొటెక్షన్ స్కీమ్స్‌ను అమలుచేయటం కోసం ఈ డబ్బులను సెంట్రల్ గవర్నమెంట్.. మూడు సంస్థల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. అవి.. 1. స్టేట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్(నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్). 2. నాన్–ల్యాప్సబుల్ సెంట్రల్ పూల్ ఆఫ్ రిసోర్సెస్. 3. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్). అసోంలోని ‘ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్’(ఏఐయూడీఎఫ్) పార్టీ చీఫ్, లోక్‌సభ ఎంపీ బదారుద్దీన్ అజ్మల్ ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించారు. వరదల పాపాన కూడు, గూడు కోల్పోతున్న తమ రాష్ట్రవాసులను ఈ కడగండ్ల నుంచి గట్టెక్కించటానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఈ ప్రశ్నకు ‘సెంట్రల్ వాటర్ రిసోర్సెస్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్’ శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా ఈ నెల 4న అక్షరాలా ఆన్సర్ చెప్పారు.
అస్సాంలో నేల తల్లిని నమ్ముకున్న సుమారు 90 వేల మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గడచిన ఐదేళ్లుగా వరదల వల్ల భూములు కోల్పోతూ కోలుకోలేని రీతిలో దెబ్బతింటున్నారు. పొలాలు, చేలు ఏవీ చేతికి అందటం లేదు. ఇది ఎవరో ఊరూపేరు లేనివాళ్లు చెప్పిన అల్లాటప్పా విషయం కాదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో రాతపూర్వకంగా తెలిపిన బాధాకరమైన అంశం. ఫ్లడ్ మేనేజ్మెంట్కి, నేలలు దెబ్బతినకుండా చూడటానికి సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లు రూ.కోట్లు ఖర్చుపెడుతున్నా పరిష్కారం నోచుకోలేకపోతున్న సమస్య.