- గ్రేటర్ సిటీకి తాగునీటి ప్రాబ్లమ్ లేనట్టే
- భారీ వర్షాలకు జంట జలాశయాల్లోకి వరద
- సిటీవాసులకు తీరనున్న తాగునీటి కష్టాలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్సిటీకి తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కొద్దిరోజుల్లో సిటీ వాసుల సరిపడా నీరు అందించే రిజర్వాయర్లు నిండే చాన్స్ ఉంది. ప్రధానంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ లో జలకళ కనిపిస్తుంది. వానలు పడుతుండగా పరీవాహక ప్రాంతాల నుంచి సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లకు భారీగా వరదనీరు వస్తోందని, నాగార్జునసాగర్‌కు ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని మెట్రోవాటర్‌బోర్డు అధికారులు తెలిపారు.
గత సమ్మర్ లో సిటీలో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాటర్‌బోర్డు సరఫరా చేసే నీటికి భారీగా డిమాండ్పెరిగింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి తాగునీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా బోర్డు అధికారులు రాత్రింబవళ్లు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు.
వానలు పడుతుండగా..
ప్రధానంగా సిటీకి నీటిని సరఫరా చేసే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి కూడా వరద నీరు చేరుతోంది. రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ, శంకర్పల్లి, మొయినాబాద్, శంషాబాద్తదితర పరీవాహక ప్రాంతాలు ఉండగా.. అక్కడ వానలు పడుతుండగా జంట జలాశయాలకు జలకళ సంతరించుకుంటోంది. ఈ జలాశయాల నుంచి రోజుకు 60 ఎంజీడీల నీటిని అవసరాలకు తరలిస్తుంటారు.
త్వరలో ప్రాజెక్ట్ లోకి మరింత వరద పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. సింగూరు , మంజీరా ప్రాజెక్టుల్లోనూ వరదనీరు చేరుతుండగా.. వీటికి మహారాష్ట్రలోనే పరీవాహక ప్రాంతాలు ఉండగా.. అక్కడ కురుస్తుండగా వరద వస్తోంది. సోమవారం నాటికి 0.033 టీఎంసీల వరద చేరిందని వాటర్ బోర్డు తెలిపింది. సింగూరు నీటితో సిటీకి 270 రోజులకు సరిపడా సరఫరా చేసే చాన్స్ ఉంది.
రివర్స్ పంపింగ్ నిలిపివేత..
ప్రధానంగా సిటీకి నీటిని అందించే ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు గోదావరి నుంచి వరద వచ్చి చేరుతుండగా.. తాజాగా 0.087 టీఎంసీలు చేరింది. దీంతో డెడ్ స్టోరేజీ నుంచి వాడుకునే రివర్స్ పంపింగ్సరఫరాను నిలిపి వేసి.. మోటార్లు, పైపులను పక్కనపెట్టారు. సిటీకి రోజుకు 500 ఎంజీడీ( మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నీరు అవసరం అవుతుంది. ఇందులో గోదావరి నుంచి రోజుకు160ఎంజీడీలు తీసుకుంటారు. దీని ద్వారా గ్రేటర్సిటీలోని సగం ప్రాంతాలు, శేరిలింగంపల్లి, ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ సమీప గ్రామాలకు సరఫరా చేస్తుంటారు.
ఆల్మట్టి నిండితే సాగర్‌లోకి ..
నాగార్జున సాగర్పరీవాహక ప్రాంతాల్లోనూ వానలు కురుస్తుండగా ఆల్మట్టి డ్యామ్‌కు వరద నీరు చేరుతోంది. అక్కడి నుంచి నారాయణపేట, జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్ ల మీదుగా సాగర్‌లోకి రావాల్సి ఉంటుంది. ఆల్మట్టి పూర్తిగా నిండితే రాష్ట్రానికి వరదనీరు వస్తుంది. సాగర్పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. కాగా సమ్మర్ లో 510కు పడిపోవడంతో పంపింగ్ద్వారా రోజుకు 270 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు.
ప్రస్తుతం రిజర్వాయర్ లో 503 అడుగుల మేరకు నీరు ఉంది. దీంతో రివర్స్ పంపింగ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సాగర్ లోకి త్వరలో భారీగా వరద నీరు చేరనుందని పేర్కొన్నారు.