మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఫ్లోరింగ్ పూర్తిగా శిథిలమై విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. క్లాస్రూంలు, వరండాల్లో ఏండ్ల కిందట కంకర, బండలతో వేసిన ఫ్లోరింగ్ పగిలిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వరండాల్లో నడవడానికి, క్లాస్‌రూంలలో కూర్చోవడానికి విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్లో 250 మంది స్టూడెంట్లు ఉన్నారు.
12 క్లాస్రూంలు ఉండగా, అన్నింట్లోనూ ఫ్లోరింగ్ అధ్వానంగా మారింది. బండలు కాళ్లకు తట్టుకొని విద్యార్థులు తరచూ కిందపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు స్టూడెంట్లకు చేతులు విరిగాయి. గుంతల్లో బండల కింద పాములు, తేళ్లు దూరుతుండడంతో ప్రాణాలకు ప్రమాదం పొంచివుందని ఆందోళన చెందుతున్నారు.
రినోవేషన్పై నిర్లక్ష్యం...
ఫ్లోరింగ్‌తో పాటు స్కూల్లో నెలకొన్న సమస్యలను టీచర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని వాపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే ఫండ్ నుంచి రినోవేషన్ కోసం రూ.50 లక్షలు శాంక్షన్ చేశారు. పనులు చేపట్టేలోగా ప్రభుత్వం 'మన ఊరు–మన బడి' ప్రోగ్రాంను ప్రకటించడంతో ఎమ్మెల్యే ఫండ్‌ను క్యాన్సల్ చేశారు.
విద్యాశాఖ అధికారులు సైతం మన ఊరు–మన బడిలో పెట్టించి రిపేర్లు చేయిస్తామని ఊరించి చివరకు హ్యాండ్ ఇచ్చారు. జిల్లాలో ఫస్ట్ ఫేస్‌లో 248 స్కూళ్లను ఎంపిక చేసినప్పటికీ అధ్వానంగా ఉన్న గర్మిళ్ల స్కూల్‌ను ఎందుకు విస్మరించారో అధికారులకే తెలియాలి.
స్కూల్ ఎదుట విద్యార్థుల ధర్నా...
గర్మిళ్ల హైస్కూల్లో శిథిలమైన ఫ్లోరింగ్‌ను తొలగించి కొత్తగా నిర్మించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు శుక్రవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. స్కూల్ మెయిన్ గేట్ ఎదుట బైటాయించి తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.
క్లాస్రూంలు, వరండాల్లోని ఫ్లోరింగ్ పగిలిపోయి గుంతలయ్యాయని, బండలు తట్టుకొని కిందపడి గాయాలవుతున్నాయని, పాములు, తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈవో పోచయ్య వచ్చి 15 రోజుల్లో రిపేర్లు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.