అక్టోబర్ 14 నుంచే బతుకమ్మ సందడి

  •   ఇయ్యాల ఎంగిలిపూలతో 
  •    మొదలుకానున్న ‘పూల సంబురం’ 
  •    స్కూళ్లు, కాలేజీలకు సెలవులతో ఆడబిడ్డలు రెడీ
  •    తీరొక్క పూల అమ్మకాలతో చౌరస్తాలు బిజీ

వరంగల్‍, వెలుగు : ఎంగిలిపూల బతుకమ్మతో శనివారం తెలంగాణలో పూల జాతర మొదలుకానుంది. ఇక ప్రతి పల్లెలో..ప్రతి వాడలో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఊయ్యాలో..’ ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయె చందుమామ’ లాంటి పాటలు మారుమోగనున్నాయి. దసరా నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో ఆడబిడ్డలు బతుకమ్మ ఆడిపాడేందుకు రెడీ అయ్యారు. శనివారం పెత్రామాస సందర్భంగా ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే సంబురాలు 22వ తేదీ సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.

తీరొక్క పూలకు డిమాండ్‍

సంప్రదాయ తంగేడు, గునుగు, సీత జెడ వంటి పూలు నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉండవు కాబట్టి చాలామంది వాటిని సిటీలకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే నగరాలు, పట్టణాల్లోని చౌరస్తాలు పూలతో కలర్‍ఫుల్‍గా కనిపించాయి. బతుకమ్మ పేర్చడానికి అవసరమైన పూలను కట్టల చొప్పున విక్రయించారు. రంగుల్లో అద్దిన గునుగు కట్టలకు తోడు బంతి, చామంతి పూలకు మార్కెట్​లో  మంచిరేటు పలికింది.  

వెయ్యిస్తంభాల గుడిలో ఏర్పాట్లు చేయలే..

బతుకమ్మకు ఓరుగల్లు ఫేమస్‍. ఎంగిలిపూల బతుకమ్మ కోసం హనుమకొండ వెయ్యిస్తంభాల దేవాలయంలో ప్రభుత్వం తరఫున అధికారులు ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది. వేలాది మంది మహిళలు తరలివచ్చే క్రమంలో బతుకమ్మ ఆడుకునేలా ఈ ప్రాంతమంతా చదును చేయిస్తారు. రంగురంగుల లైట్లు. డీజేలు, సీసీ కెమెరాలు, మంచినీటి సౌకర్యంతో పాటు బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. ఎన్నికల కోడ్‍ పేరుతో అధికారులు ఈసారి శుక్రవారం నాటికి కూడా ఎలాంటి పనులు ముట్టుకోలేదు.

ఎన్నికల అధికారులకు లెటర్‍ రాశామంటూ సైలెంట్‍గా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. వెయ్యిస్తంభాల గుడితో పాటు కాజీపేట వడ్డెపల్లి చెరువు, హనుమకొండ పద్మాక్షి గుండం, వరంగల్‍ దేశాయిపేట, చిన్న వడ్డెపల్లి, ఖిలా వరంగల్‍ గుండు చెరువు, శివనగర్‍ అగర్త తదితర ప్రాంతాల్లో వెంటనే ఏర్పాట్లు చేయాలని విశ్వహిందూ పరిషత్‍, బజరంగ్‍దళ్‍ సంస్థలు డిమాండ్‍ చేశాయి. కలెక్టర్లు, ఆర్డీఓలు, గ్రేటర్‍ కమిషనర్లకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపాయి.