- చెవిలో పువ్వు, నోటిలో వేలితో మౌనదీక్ష
- నిరుద్యోగుల కోసం వినూత్న నిరసన
అనంతపురం: నిరుద్యోగుల సమస్యలను నెరవేర్చాలంటూ ఏపీలో వినూత్న నిరసన చేపట్టారు. ఆదివారం అనంతపురం నగరంలోని క్లాక్‌టవర్ గాంధీ విగ్రహం ఎదుట చంద్రదండు ఆధ్వర్యంలో చెవిలో పువ్వు, నోటిలో వేలి పెట్టుకుని, మౌనదీక్ష చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల సమస్యలపై చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికి నిరుద్యోగులు, ప్రజలకు మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.5వేలు ఇస్తామన్నారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరుద్యోగుల కోసం ఖాళీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారన్నారు. ఏపీలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి నిరుద్యోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రకాష్‌నాయుడు సీరియస్ అయ్యారు.