ఉగాది పండుగ ఎపెక్ట్ : హైదరాబాద్‌లో పూలు, మామిడాకులు మస్త్ పిరం

ఉగాది పండుగ ఎపెక్ట్ : హైదరాబాద్‌లో పూలు, మామిడాకులు మస్త్ పిరం
  • పండుగ పూట అమాంతం పెంచేసిన దళారులు

మెహిదీపట్నం/ పద్మారావునగర్, వెలుగు: ఉగాది పండుగ పూట పూల ధరలకు రెక్కలు వచ్చాయి. గుడిమల్కాపూర్ పూల మార్కెట్​లో పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని దళారులు అమాంతం రేట్లను పెంచేశారు. సాధారణ రోజుల్లో బంతిపూలు కిలో రూ.40 ఉండగా, ఆదివారం ఉదయం కిలో రూ.80 పలికింది. రూ.80 నుంచి రూ.100 ఉండే చామంతి ఉగాది నాడు ఏకంగా రూ.200 నుంచి రూ.250 వరకు  అమ్మారు. 

ప్రతిరోజు రూ.80 నుంచి రూ.100 వరకు అమ్మే గులాబీ ధర కూడా రెట్టింపయ్యింది. ప్రతిసారి పండుగ వేళ దళారులు పూల ధరలను పెంచుతూనే ఉన్నారని వినియోగదారులు మండిపడ్డారు. అధికారులు స్పందించి పండుగ సమయంలో ధరలు పెరగకుండా చూడాలని కోరారు. ఇక సిటీలోని వేర్వేరు చోట్ల మామిడాకులు, వేప పువ్వు కనీసం ధరను రూ.30 గా నిర్ణయించి అమ్మారు.