Alef Aeronautics: విమానంలా ఎగిరే కారు వచ్చేస్తుంది..ఆటోపైలైటింగ్ ఫీచర్తో

 Alef Aeronautics: విమానంలా ఎగిరే కారు వచ్చేస్తుంది..ఆటోపైలైటింగ్ ఫీచర్తో

ఇప్పటివరకు రోడ్లపై నడిచే కార్లను మనం చూశాం..ఇటీవల కాలంలో రోడ్లు, నీటిలో నడిచే కార్లు కూడా తయారు చేశారు. కానీ ఇంకా టెస్టింగ్ దశలో ఉన్నాయి.. ఇప్పుడు రోడ్డుపైనా, ఆకాశంలో ఎగిరే కారు కూడా వచ్చేస్తోంది. దీనిని అమెరికాకు చెందిన ఆటోమేకర్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేసింది. ఆకాశంలో ఎగురుతున్న కారు మొదటి వీడియోను విడుదల చేసింది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసినట్లుగా అనిపిస్తోంది.  

డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఉపయోగించి ప్రొపెల్లర్ బ్లేడ్ లను కప్పి ఉంచే మెష్ పొరతో కారు భూమిపైన ఎగరగలుగుతుంది. కంపెనీ ట్రయల్ కోసం అలెఫ్ మోడల్ జీరో అల్ట్రాలైట్ వెర్షన్ అయిన ప్రోటోటైప్ ను ఉపయోగిచింది. 

ఈ ఆకాశంలో ఎగిరే కారు ధర రూ. 2.5 కోట్లు. దీనిని వీధుల్లో అంటే రోడ్లపై నడపవచ్చు.. ఆకాశంలో నడపవచ్చు. ఇక్కడ మీకో సందేహం రావచ్చు. ఆకాశంలో ఎగిరే ఫ్లైట్లకు ప్రత్యేక పైలట్లు ఉంటారు కదా.. మరీ ఈ కారును నడిపేందుకు పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలా అని.. అవసరం లేదు.. దీనిలో ఆటోపైలటింగ్ విమాన సామర్థ్యం కూడా ఉంది. ఈ కారు కొనుగోలు డిమాండ్ చాలా ఉంది.. ఇప్పటికే 3300 కార్లకు ముందస్తుగా ఆర్డర్లు వచ్చాయట. 

ఇక ఈ అలెఫ్ కారు.. 165కిలోమీటర్లు ఎగిరే పరిధి, 300 కిలోమీటర్లు డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంది. ఈ కారులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ కారును త్వరలో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.