- ముగ్గురిపై కేసు నమోదు, ఇద్దరి సస్పెన్షన్
మహబూబాబాద్అర్బన్, వెలుగు : అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లోని ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 15నుంచి మహబూబాబాద్ మండలంలో ఫ్లయింగ్ స్వ్కాడ్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ సభ్యులు ఈ నెల 17 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 20న మండలంలోని నడివాడ, గడ్డి గూడెం, రెడ్యాల, సండ్రేల్ల గూడెం గ్రామాల్లోని కిరాణా షాపుల్లో తనిఖీలు చేశారు.
కొన్ని షాపుల్లో మద్యం పట్టుబడగా.. కేసులు కాకుండా చూస్తామని షాప్ యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. రెడ్యాల గ్రామంలోని మంచాల వేణు షాపు వద్ద ఫోన్ పే ద్వారా రూ.1,500 తీసుకున్నట్లు ఆయన మిత్రుడైన నల్లు దేవేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయగా.. టీమ్‌లోని ఎస్కే సద్దాం హుస్సేన్ (జూనియర్ అసిస్టెంట్) పలు షాపుల నుంచి నగదు తీసుకోవడంతో పాటు వారి టీమ్‌లో ఉన్న ఫొటోగ్రాఫర్ కండే వెంకటేశ్వర్లు నెంబర్‌కు ఫోన్ పే చేయించుకున్నట్లు తేలింది.
ఇలా మొత్తం రూ.15,100- వసూలు చేసి.. టీమ్ లీడర్ సామ్రాజ్‌కు రూ.10,500 ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో శనివారం సద్దాం హుస్సేన్, ఐమల్ల సామ్రాజ్, కండె వెంకటేశ్వర్లుపై కేసు పెట్టి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వీరితోపాటు టీమ్ సభ్యులైన హెడ్ కానిస్టేబుల్ రమేశ్ , గోపీని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.