ఖమ్మం టౌన్,వెలుగు : ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు అలర్ట్గా పనిచేయాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం న్యూ కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ఎన్నికల వ్యయ పరిశీలకుడు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి, శంకర నంద్ మిశ్రాతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఫంక్షన్ హాళ్లు, గోడౌన్లలో తనిఖీలు చేపట్టాలన్నారు. పోలింగ్ రోజు ఫ్లయింగ్ స్క్వాడ్ పాత్ర ఎంతో కీలకమన్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం, ప్రలోభపెట్టడం చేస్తే క్విక్ రెస్పాన్స్ టీమ్ కు సమాచారం ఇచ్చి చర్యలు చేపట్టాలని సూచించారు.
రైల్వే స్టేషన్లలో గూడ్స్ సెక్షన్ లోనూ తనిఖీలు చేయాలని చెప్పారు. వ్యయ పరిశీలకుడు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి మాట్లాడుతూ ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలన్నారు. ప్రచార వాహన అనుమతులు తనిఖీ చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల సందర్శనలు పెంచాలన్నారు. శంకర నంద్ మిశ్రా మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సివిజిల్ యాప్ ఫిర్యాదులపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో సమీక్షించారు. ఈ సమావేశంలో కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి ఏ. శ్రీనివాస్, వ్యయ నోడల్ అధికారి, జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం న్యూ కలెక్టరేట్ లో పోలింగ్ అధికారుల విధుల నిర్వహణపై టీచర్ యూనియన్లతో ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ విధులకు అందరూ హాజరు కావాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో, రిసెప్షన్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ తో పాటు, వెల్ ఫెర్ కిట్ అందజేస్తున్నట్లు వివరించారు.
జడ్జితో కలెక్టర్ భేటీ
ఇటీవల జిల్లా నూతన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి గా జి.రాజగోపాల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనను బుధవారం జిల్లా కోర్టులో కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా కలిసి విషెస్ తెలిపారు.