రూ.7 వేల కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్​పాస్ లు

రూ.7 వేల కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్​పాస్ లు
  • ప్రభుత్వ ఆమోదానికి సిఫార్సు చేయాలని నిర్ణయం
  • మేయర్​ విజయలక్ష్మి అధ్యక్షతన   జీహెచ్​ఎంసీ స్టాండింగ్ ​కమిటీ సమావేశం
  • 13 అంశాలకు సభ్యుల ఆమోదం

హైదరాబాద్​సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం బల్దియా స్టాండింగ్​కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 13 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో రూ.6 కోట్ల97లక్షల85వేలతో మూడు డీ-సిల్టింగ్ పనులు చేయాలని నిర్ణయించారు.

 చార్మినార్ జోన్ లో రూ.2కోట్ల29లక్షల95వేలు, ఖైరతాబాద్ జోన్ లో రూ.2కోట్ల64లక్షల30వేలు, సికింద్రాబాద్​జోన్​లో రూ.2కోట్ల3లక్షల60వేలతో చేపట్టే పనులకు పరిపాలన అనుమతితోపాటు ఈ–ప్రొక్యూర్​మెంట్​ద్వారా టెండర్ పిలిచేందుకు ఆమోదం తెలిపారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో ఆరు డీసిల్టింగ్ పనులకు రూ.22కోట్ల31లక్షల75వేల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతితోపాటు టెండర్ పిలవడానికి ఆమోదం తెలిపారు. 

స్టీల్​ ఫ్లైఓవర్​, అండర్​ పాస్ ​కోసం..

రోడ్ నెం.45  ఫిలింనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాల కోసం రూ.510 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన పనులకు, ప్యాకేజీ 1 కింద జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్, ముగ్దా జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణానికి రూ.580 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనుల ప్రతిపాదనకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. 

లాలాపేట ఫ్లైఓవర్ నుంచి మౌలాలి ఫ్లైఓవర్ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు మంజూరైన రూ.3 కోట్లకు అదనంగా రూ.1.30 కోట్లకు రివైజ్ చేస్తూ  పరిపాలన అనుమతి కోసం కమిటీ ఆమోదించింది. హైదరాబాద్ ఇన్నోవేటివ్ ట్రాన్స్​ఫర్మేటివ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ) కింద ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలకు రూ.7,032 కోట్లతో చేపట్టే పనులకు ప్రభుత్వ ఆమోదం కోసం సిఫార్సు చేయాలని నిర్ణయించారు. 

227 ఆస్తుల సేకరణ

గుల్మొహర్ పార్కు జంక్షన్ నుంచి తారా నగర్ మీదుగా బీహెచ్ఈఎల్​జంక్షన్ వరకు,  రైల్వే క్రాసింగ్ లింగంపల్లి నుంచి1100 మీటర్ల పొడవు రోడ్డు, విద్యానికేతన్ స్కూల్ నుంచి గుల్మొహర్ జంక్షన్ వరకు 30 మీటర్లు, 36 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులకు 227 ఆస్తుల సేకరించడానికి ప్రభుత్వ అనుమతి కోసం కమిటీ సిఫార్సు చేసింది. 

నేషనల్ హైవే 44 పైన ఆరు లేన్ల గ్రేడ్ సపరేటర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్ ప్రెస్ వే గా నామకరణం చేసేందుకు ఆమోదం తెలిపింది. కేబీఆర్ పార్కు పరిసరాల్లో ఎంట్రన్స్ పాయింట్స్ వద్ద గ్రీనరీ కోసం క్రియేటివ్ థాట్స్ మీడియా మూడేండ్ల పాటు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. కమిషనర్ ఇలంబరితి, స్టాండింగ్ కమిటీ మెంబర్స్, అధికారులు పాల్గొన్నారు.