కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులపై ఫోకస్ చేసింది. పీఎం గతి శక్తి ద్వారా దేశవ్యాప్తంగా వంద కార్గో టెర్మినల్స్ నిర్మించనున్నారు. గత బడ్జెట్లకు భిన్నంగా ఈసారి 160 కిలోమీటర్లకు పైగా వేగంతో పయనించే వందే భారత్ రైళ్లను భారీ సంఖ్యలో ప్రవేశపెట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటికే 100రైళ్లు పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సన్నద్ధంకాగా.. తాజాగా రానున్న మూడేళ్లలో మరో 400 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. వీటితో పాటు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా 2000 కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ను విస్తరించనున్నారు. పోస్టల్, రైల్వే నెట్వర్క్ను అనుసంధానించనున్నట్లు వెల్లడించారు.
కొత్తగా అందుబాటులోకి తెచ్చే వందే భారత్ రైళ్లను పూర్తిగా లింకే హఫ్మన్బుష్ కోచ్ లతో నిర్మించనున్నారు. ప్రస్తుతం రాయ్ బరేలీ, కపుర్తలా, చెన్నైలలోని ఫ్యాక్టరీల్లో ఈ కోచ్లను తయారు చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే నెట్వర్క్ను ఉపయోగించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎరువుల సరఫరాకే రైల్వే నెట్వర్క్ ఉపయోగపడుతుండగా.. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల దృష్ట్యా రైల్వే కార్గో సేవల్ని ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.