న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భూరికార్డులను ఆధునీకరించడంతో పాటు పట్టణాభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మ్యాపింగ్ కోసం ‘నేషనల్ జియో స్పేషియల్ మిషన్’ను చేపట్టనున్నట్టు బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు.
దేశంలోని సిటీలను, ప్రభుత్వ ల్యాండ్ రికార్డులను అంతరిక్ష శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఇదివరకే డిజిటైజ్ చేశాయని, ఆ ప్రాజెక్టుకు ఈ మిషన్‌తో మరింత ఊతం లభిస్తుందన్నారు. ఇస్రో జియోస్పేషియల్ సేవలతో అమలయ్యే ఈ మిషన్ కోసం రూ.100 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.
టెక్నాలజీ ద్వారా పరిపాలన, సేవలను మెరుగుపర్చే లక్ష్యంతో ఈ మిషన్ చేపట్టినట్టు తెలిపారు. పీఎం గతి శక్తి మిషన్‌లో ఇది కీలకంగా మారుతుందన్నారు. కేంద్రం 2022లోనే నేషనల్ జియోస్పేషియల్ పాలసీని తీసుకొచ్చింది. దీనివల్ల భూవివాదాల పరిష్కారం, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో సమర్థంగా భూవినియోగం వంటివి సులభం కానున్నాయి.