- ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ సెగ్మెంట్ పై ఉపాధ్యాయ సంఘాల ఫోకస్
- దీటైన అభ్యర్థులను దింపేందుకు చూస్తున్న ప్రధాన పార్టీలు
- టికెట్ కోసం ఆశావహుల మధ్య నెలకొన్న పోటీ
- యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఖరారు
- బీసీల వైపు మొగ్గు చూపుతున్న పీఆర్టీయూ, తపస్
- మూడు ఉమ్మడి జిల్లాల్లో 25 వేల మంది ఓటర్లు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీపై ఆశావహులు ప్రయత్నాలు షురూ చేశారు. ఎలాగైనా దక్కించుకోవాలనే టార్గెట్ తో ముందుకెళ్తున్నారు. 2019తో పోలిస్తే ఈసారి పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పుడే ఔత్సాహికులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఆశావహులు ఉపాధ్యాయ సంఘాలు, ప్రధాన పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు అంతర్గతంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని ఖరారు అయ్యారు. పీఆర్టీయూ, తపస్ మాత్రం బీసీ అభ్యర్థి వైపు చూస్తున్నట్లు సమాచారం.
అభ్యర్థుల కోసం కసరత్తు
టీచర్ ఎమ్మెల్సీగా దీటైన క్యాండిడేట్ ను పోటీలో నిలిపేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 55 ఉపాధ్యాయ సంఘాలు ఉండగా, వీటిలో ప్రధానంగా పీఆర్టీయూ, టీఎస్ యూటీఎఫ్, తపస్ మధ్యనే పోటీ నెలకొని ఉంది. గత ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ పై టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ఈసారి ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు మూడు యూనియన్లు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి ఖరారు
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డినే మరోసారి బరిలో నిలపాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయనకు ప్రభుత్వ కాలేజీల జూనియర్ లెక్చరర్ల సంఘం, పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపక సంఘం, మోడల్ స్కూల్ సంఘం, గురుకులాల ఉపాధ్యాయ సంఘాలు, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, జనరల్ సొసైటీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
పట్టు కోసం పీఆర్టీయూ ప్రయత్నాలు
ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ దక్కించుకోవాలని పీఆర్టీయూ పట్టుకోసం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కాంగ్రెస్ సపోర్ట్ తో పీఆర్టీయూ నుంచి గెలిచిన పూల రవీందర్ బీఆర్ఎస్ లోకి వెళ్లడంతో ఉపాధ్యాయ సంఘాల్లో వ్యతిరేకత ఏర్పడింది. దీంతో 2019 ఎన్నికల్లో పీఆర్టీయూ ఓటమి చెందింది. పైగా సర్వోత్తమ్ రెడ్డి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు రెండుగా చిలిపోయాయి. ఈసారి కోల్పోయిన సీటు ఎలాగైనా దక్కించుకోవాలని పీఆర్టీయూ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థిగా శ్రీపాల్ రెడ్డి ఖరారయ్యే చాన్స్ ఉంది. మరోవైపు బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తుండడంతో కొత్తగా సుంకరి భిక్షం పేరు వినిపిస్తోంది. మరోవైపు మూడోసారి పూల రవీందర్ సైతం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా ఎవరికి టికెట్ వస్తుందోననే సస్పెన్స్ నెలకొంది.
తపస్ నుంచి అభ్యర్థుల పోటాపోటీ
గతంలో పీఆర్టీయూలో కీలకంగా పని చేసి టికెట్ రాకపోవడంతో రెబల్ గా పోటీ చేసిన పులి సర్వోత్తమ్ రెడ్డికి ఈసారి తపస్ నుంచి టికెట్ దక్కుతుందనే ప్రచారంలో ఉంది. మరోవైపు సూర్యాపేట జిల్లాకు చెందిన తీకుళ్ల సాయిరెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాల్లో ఓటరు నమోదుపైనా ప్రచారం చేస్తూ టికెట్ తనకే వస్తుందనే ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉండడంతో బీజేపీ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. బీసీ నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో కస్తూరి ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు.
బీఆర్ఎస్ అనాసక్తి..
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే వరంగల్, నల్లగొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవడం, బీఆర్ఎస్ తో పీఆర్టీయూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నత్తనడకన ఓటర్ ఎన్రోల్మెంట్
ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మూడు జిల్లాల్లో దాదాపు 25 వేల మంది ఓటర్లు ఉండగా, ప్రతిసారీ కొత్తగా నమోదు చేసుకోవా ల్సి ఉంటుంది. టీచర్ల ఓటరు నమోదు వచ్చే నెల 6 వరకు గడువు ఉంది. నియోజకవర్గాల పరిధిలో12 జిల్లాలు ఉండగా, వీటిలో10 జిల్లాల్లో ఇప్పటివరకు 142 మంది మాత్రమే ఆన్ లైన్ లో అప్లై చేసుకున్నారు.
నల్గొండలో 38, సూర్యాపేటలో 22, యాదాద్రిలో 8, జనగామలో 4, మహబూబాబాద్ లో 8, వరంగల్ లో 11, హనుమకొండ లో 24, భద్రాద్రి లో 6, ఖమ్మంలో 18, ములుగులో 3 మాత్రమే అప్లికేషన్లు వచ్చాయి. భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల నుంచి ఒక్క అప్లికేషన్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం.