పార్టీలు బంద్ చెయ్.. బాగుపడతావ్: భారత క్రికెటర్‌కు పాక్ మాజీ దిగ్గజం సలహా

పార్టీలు బంద్ చెయ్.. బాగుపడతావ్: భారత క్రికెటర్‌కు పాక్ మాజీ దిగ్గజం సలహా

విధ్వంస‌కర ఆట‌గాడిగా, భారత భ‌విష్యత్ తార‌గా వెలుగొందిన పృథ్వీ షా ఈ ఏడాది ఒక్క మ్యాచ్‌లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడింది  లేదు. ఇప్పటివరకూ 8 మ్యాచ్‌ల్లో 198 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ పై చేసిన 66 పరుగులే అత్యధికం. దీంతో జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతని ప్రదర్శనపై పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ తీవ్రంగా మండిపడ్డారు. 

ఎలాంటి మొహమాటం లేకుండా పార్టీలు బంద్ చెయ్.. ఆటపై దృష్టి సారించు.. బాగుపడతావ్.. రిటైర్ అయ్యాక ఎన్ని పార్టీలైనా చేసుకోవ‌చ్చు.. అంటూ ఎడా పెడా నాలుగు వాయించారు. ఐపీఎల్ మెగా టోర్నీకి ముందు షా.. దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపించాడు. అయితే, ఆ ఫామ్ ఇక్కడ కనిపించడం లేదు. నిలకడ లేమితో సతమతమవుతున్నాడు. ఇలా జరగకూడదంటే షా క్రమం తప్పకుండా క్రికెట్ ఆడుతూనే ఉండాలని, ఫీల్డ్ బయట తన గురించి తాను కాస్త ఆలోచించుకోవాలని అక్రమ్ అన్నారు. 

షాలో అత్యుత్తమ క్రికెట్ ఆడ‌గ‌ల స‌త్తా ఉందన్న పాజ్ మాజీ దిగ్గజం.. అతను ఆట‌పైనే దృష్టి పెడితే సంచలనాలు నమోదు చేయగలరని అభిప్రాయపడ్డారు. "అతను(పృథ్వీ షా ) క్రమం తప్పకుండా క్రికెట్ ఆడుతుండాలి. ఫీల్డ్ బయట తనను తాను నియంత్రించుకోవాలి. పార్టీల‌పై కాదు.. క్రికెట్ మీద దృష్టి పెట్టాలి..  రిటైర్మెంట్ ప్రకటించాక ఎన్ని పార్టీలైనా చేసుకోవ‌చ్చు. అప్పుడు ఎవ‌రూ నిన్ను ప్రశ్నించరు.." అని అక్రమ్ ఢిల్లీ ఓపెన‌ర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యాలు చేశారు.

6 విజ‌యాలతో..

ప‌దిహేడో సీజ‌న్‌లో ఢిల్లీ అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ బ‌రిలో నిలిచింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయాన్ని నమోదుచేయగా.. రెండో అర్ధభాగంలో ఏడింటిలో ఐదింట విజయం సాధించింది. ప్రస్తుతం 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు పోటీగా మారింది. పంత్ సేన త‌ర్వాతి రెండు మ్యాచుల్లో ఆర్సీబీ, ల‌క్నోతో ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తే..ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.