మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ జి.రవి నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీలకు 2013 నుంచి ఇప్పటివరకు కొనుగోలు చేసి ఇచ్చిన భూములు, ప్రస్తుతం వాటి పరిస్థితిపై నివేదిక అందించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు.
లబ్ధిదారులు ఉండని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వాటిని గుర్తించి వెంటనే తాళాలు వేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో డబుల్ ఇండ్లపై ఎక్కువ ఫోకస్ చేయాలన్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల శిఖం భూములు, లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు, ఎన్వోసీ ఇచ్చిన తర్వాత నిర్మించుకున్నవి, అనుమతులు లేకుండా నిర్మించిన వాటి వివరాలను వేర్వేరుగా అందించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్ మోహన్ రావు పాల్గొన్నారు.