ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి : కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్/బెల్లంపల్లి/కోల్​బెల్ట్, వెలుగు : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్, ఆర్డీవో  శ్రీనివాసరావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 

రేషన్ కార్డులు, డబుల్ ​బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని, రేచినిలో కొత్త మీసేవా కేంద్రం ఏర్పాటు చేయాలని, బెల్లంపల్లిలోని చంద్రవెల్లి గ్రామపంచాయతీని మండలంగా ఏర్పాటు చేయాలని, బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న 24 చెట్లను అనుమతులు లేకుండా తొలగించారని, చర్యలు తీసుకోవాలని  తదితర దరఖాస్తులు అందాయి. 

శాంతిఖని- 2 ఓపెన్ కాస్ట్ ప్రతిపాదన రద్దు చేయాలి

బెల్లంపల్లి మండలంలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేయనున్న శాంతిఖని- 2 ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనను రద్దు చేయాలని కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీల అఖిలపక్ష నాయకులు కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఓపెన్ కాస్ట్ గనిని ప్రారంభిస్తే బెల్లంపల్లి మండలంలోని లింగాపూర్, ఆకెనపల్లి, పాత బెల్లం పల్లి, పెద్దదుబ్బపల్లి, బుచ్చయ్యపల్లి తదితర 15 గ్రామాల ప్రజలు భూమి కోల్పోతారని, ఈ విషయాన్ని యాజమాన్యం గమనించాలని కోరారు.

లేమూరు గుడిపల్లిని పంచాయతీగా మార్చాలి

మందమర్రి మండలం వెంకటాపూర్​పంచాయతీ పరిధిలోని గుడిపల్లి, లేమూరు, ఎమ్మెల్యే కాలనీలను కలిపి కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. వెంకటాపూర్ పంచాయతీలో 10 వార్డుల్లో 2,500 మంది జనాభా ఉన్నారని, వారిలో 1700 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. గతంలో రెవెన్యూ గ్రామంగా లేమూరు గుడిపల్లి సపరేట్​గా ఉండేదని ప్రస్తుతం వెంకటాపూర్ ​పంచాయతీలో ఉండటంతో పూర్తిస్థాయి అభివృద్ధి జరగడంలేదన్నారు.