బెంగళూరు : ఓవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్ట్‌ల్లోకి రీ ఎంట్రీ.. మరోవైపు స్టార్ ప్లేయర్లకు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయడం.. ఈ రెండు అంశాల నేపథ్యంలో గురువారం నుంచి దులీప్ ట్రోఫీ పోటీలు జరగనున్నాయి. తొలి రౌండ్‌లో టీమ్–ఎ, బి (బెంగళూరు).. టీమ్–సి, డి (అనంతపూర్) మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై పంత్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కారు ప్రమాదంలో గాయపడి కోలుకున్నా కేవలం షార్ట్ ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. దీంతో టీమిండియా టెస్ట్ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అతన్ని రెడ్‌బాల్ క్రికెట్‌కు అనుకూలంగా మార్చాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలోని టీమ్–బి తరఫున పంత్ బరిలోకి దిగనున్నాడు. ఇప్పటి వరకు షార్ట్ ఫార్మాట్‌లో ఆకట్టుకున్న పంత్ ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో కీపింగ్‌తో పాటు బ్యాటింగ్ సవాలును ఎలా అధిగమిస్తాడో చూడాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, సిరాజ్, షమీలాంటి స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలంటే వాళ్ల స్థానాలను భర్తీ చేయబోయే కుర్రాళ్లకు ఈ టోర్నీనే కీలకం కానుంది. కాబట్టి శుభ్‌మన్ గిల్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ మిడిలార్డర్ ప్లేస్‌ల కోసం పోటీలో ఉండగా, ముకేశ్
ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ఖలీల్, విద్వత్ కావేరప్ప, విజయ్‌కుమార్, హర్షిత్ రాణా వంటి వాళ్లు బౌలర్ల రేస్‌లో నిలిచారు. స్పిన్నర్లలో అశ్విన్, జడేజా అందుబాటులో లేకపోయినా అక్షర్, కుల్దీప్, సుందర్, సాయి కిశోర్ వాళ్ల ప్లేస్‌లను భర్తీ చేసేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి టెస్ట్ సీజన్ కోసం టీమిండియాను రెడీ చేసేందుకు దులీప్ ట్రోఫీని కొలమానంగా తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. కాగా, గాయాల కారణంగా సూర్యకుమార్, ఇషాన్ కిషన్, సర్జరీ నుంచి కోలుకుంటున్న ప్రసిధ్ కృష్ణ తొలి రౌండ్ మ్యాచ్‌కు దూరమయ్యారు.