- రోహిత్, కోహ్లీ ఫామ్‌పై అందరి దృష్టి
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్
కటక్: చాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తుండగా టీమిండియాను కలవరపెడుతున్న ప్రధాన అంశం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (రో–కో)పేవల ఫామ్. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ మొదలు.. బోర్డర్–గావస్కర్ ట్రోఫీ, రంజీ మ్యాచ్.. తాజాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలోనూ రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. అటువైపు విరాట్ ఆసీస్ టూర్‌లో చివరి నాలుగు టెస్టులతో పాటు రంజీ మ్యాచ్‌లో ఏకైక ఇన్నింగ్స్‌లో తడబడ్డాడు.
ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లో ఇంగ్లిష్ టీమ్‌పై ఘన విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీపైనే అందరి ఫోకస్ ఉంది. మోకాలి నొప్పి కారణంగా కోహ్లీ తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో టీమ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ నాగ్‌పూర్‌లో మెరుపు ఫిఫ్టీతో సత్తా చాటాడు.
ఇప్పుడు విరాట్ కోసం ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. గత సంప్రదాయాన్ని అనుసరిస్తే కోహ్లీ కోసం శ్రేయస్‌ను తప్పించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కనబెట్టే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు రోహిత్‌తో కలిసి గిల్ ఓపెనర్‌గా రావాల్సి ఉంటుంది. కాంబినేషన్ సంగతి పక్కనబెడితే రోహిత్, విరాట్ ఫామ్‌పై ఆందోళన నెలకొంది.
ఆసీస్ టూర్ ఫెయిల్యూర్‌ను కొనసాగించిన రోహిత్ తొలి వన్డేలో లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో లాఫ్టెడ్ షాట్‌కు ట్రై చేసి ఔటయ్యాడు. గతేడాది ఆగస్టు తర్వాత ఏ ఫార్మాట్‌లోనూ ఫిఫ్టీ చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లో మిగతా రెండు వన్డేల్లోనూ ఫెయిలైతే అతని ఫామ్‌పైనే కాకుండా ఫ్యూచర్‌పైనా ప్రశ్నలు వస్తాయి. ఇక, ఆసీస్ టూర్‌లో ఔట్ సైడ్ ఆఫ్‌స్టంప్ బాల్స్‌ను వెంటాడి ఔటైన విరాట్.. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆరు రన్స్ మాత్రమే చేసి బౌల్డయ్యాడు. తనకెంతో ఇష్టమైన వన్డే ఫార్మాట్‌తో విరాట్ గాడిలో పడతాడేమో చూడాలి.
తిరుగులేని బౌలింగ్
బౌలింగ్‌లో ఇండియాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గాయం నుంచి కోలుకున్న మహ్మద్ షమీ క్రమంగా పుంజుకుంటున్నాడు. నాగ్‌పూర్‌లో మెయిడిన్ ఓవర్‌తో బౌలింగ్ మొదలు పెట్టిన షమీ మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అరంగేట్రం పేసర్ హర్షిత్ రాణా మూడు కీలక వికెట్లతో ఇంగ్లండ్ పనిపట్టాడు. తను ఇదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా ఫిట్‌నెస్ సాధించకపోతే హర్షిత్ మెగా టోర్నీ టీమ్‌లోకి వచ్చే చాన్సుంది. ఇక, స్పిన్‌లో ఇండియాకు తిరుగులేకుండా పోయింది. అక్షర్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటంతో టీమ్ బలం పెరిగింది.
ఇంగ్లండ్‌కు చావోరేవో
టీ20 సిరీస్ కోల్పోయి తొలి వన్డేలోనూ చిత్తయిన ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్‌కు చావోరేవో కానుంది. కటక్‌లోనూ ఓడితే మరో సిరీస్ కోల్పోనున్న నేపథ్యంలో ఆ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉండనుంది. దాంతో తమ దూకుడైన బ్యాటింగ్ విధానాన్ని పక్కనబెట్టి పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆట తీరును మార్చుకునే ప్రయత్నం చేయనుంది. బట్లర్, బెతెల్ ఫామ్‌లో ఉండగా.. మిగతా వాళ్లూ రాణించాలి. ముఖ్యంగా ఇండియా స్పిన్నర్ల సవాల్‌ను తిప్పికొట్టాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం సకీబ్ స్థానంలో సీనియర్ పేసర్ మార్క్ వుడ్‌ను ఇంగ్లండ్ బరిలోకి దింపే చాన్సుంది.
పిచ్/వాతావరణం
కటక్‌లో బారాబతి స్టేడియం తొలుత బ్యాటర్లకు సమయం గడుస్తున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ వేదికపై జరిగిన 19 వన్డేల్లో 12సార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఆదివారం వర్ష సూచన లేదు. మధ్యాహ్నం వాతావరణం కాస్త వేడిగా ఉండనుంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్/శ్రేయస్, గిల్, కోహ్లీ, అక్షర్, రాహుల్ (కీపర్), పాండ్యా, జడేజా, హర్షిత్, కుల్దీప్, షమీ.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్ (కీపర్), డకెట్, జో రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), బెతెల్, లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహ్మూద్/మార్క్ వుడ్.