కౌలాలంపూర్: ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి, సింగిల్స్ ప్లేయర్లు లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ కొత్త సీజన్ సవాల్‌కు సిద్ధమయ్యారు. గతేడాది పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇండియా షట్లర్లు మంగళవారం మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో సత్తా చాటి కొత్త ఏడాదిని మెరుగ్గా ఆరంభించాలని చూస్తున్నారు. గతేడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్ ఈసారి ఏడో సీడ్‌గా బరిలోకి దిగుతున్నారు. ఈ యేడు కచ్చితంగా టైటిల్ నెగ్గాలని ఆశిస్తున్నారు.
అయితే, వీరికి కఠినమైన డ్రా ఎదురైంది. తొలి రౌండ్‌లో చైనీస్ తైపీ జంట మింగ్ చె లు–టాంగ్ కై వీతో పోటీ పడనున్న ఇండియా డబుల్స్ స్టార్లు క్వార్టర్ ఫైనల్లో ఇండోనేసియాకు చెందిన నాలుగో సీడ్స్ ఫజర్ అల్ఫియన్–ముహమ్మద్ రియాన్‌ను ఎదుర్కోనున్నారు. సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన లక్ష్యసేన్ సింగిల్స్ తొలి రౌండ్‌లో తైపీ షట్లర్ చి యు జెన్‌తో పోటీ పడనున్నాడు. ప్రణయ్.. కెనడాకు చెందిన బ్రియాన్ యంగ్‌తో తన పోరు ఆరంభిస్తాడు.
ప్రియాన్షు రజావత్ కూడా పోటీలో నిలిచాడు. ఇటీవలే పెండ్లి చేసుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీకి దూరంగా ఉంది. విమెన్స్ సింగిల్స్‌లో ఇండియా నుంచి మాళవిక బన్సొద్, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ బరిలో నిలిచారు. విమెన్స్ డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ,
అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో, మిక్స్‌డ్‌లో తనీషా–ధ్రువ్ కపిల తదితరులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.