సింగరేణి ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించండి.. సీఎండీ బలరామ్ ఆదేశాలు

సింగరేణి ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించండి.. సీఎండీ బలరామ్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: సింగరేణి చేపట్టిన ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయడానికి వెంటనే తగిన ప్లాన్​ రూపొందించాలని సంస్థ సీఎండీ బలరామ్​ అధికారులను ఆదేశించారు. ఎలక్షన్​ కోడ్ ముగిసిన నేపథ్యంలో వెల్ఫేర్​​ప్రోగ్రామ్స్, ఎంప్లాయీస్​కు అందించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ నుంచి 25కు పైగా శాఖల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఉత్పత్తి, రవాణాపైనే నెలవారీ సమీక్ష నిర్వహించడం జరిగిందని, ఇకపై సంక్షేమంతోపాటు ఇతర అన్ని విభాగాల పనితీరుపైనా సమీక్షలు చేస్తామన్నారు. 

ఆయా విభాగాలకు అప్పగించిన పనుల పురోగతిని తెలుసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంతో పోటీ పడేలా మన సామర్థ్యాలను, ఆలోచన విధానాలను మార్చుకొని ముందుకు సాగాలన్నారు. సింగరేణి వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయని.. అధికారులు, ఉద్యోగులు తమ బాధ్యతను సమర్థంగా నిర్వహించగలిగితే దేశంలోనే అత్యున్నత స్థాయికి చేరుకుంటుందన్నారు. పని గంటలు, మానవ వనరుల వినియోగం అత్యంత కీలకమన్నారు. విధుల పట్ల అలసత్వం, లక్ష్య సాధన పట్ల నిర్లక్ష్యం చూపే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోని సీఎండీ హెచ్చరించారు. బొగ్గు ఉత్పత్తితోపాటు సంక్షేమం, రక్షణకు యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 

రక్షణ విషయంలో అత్యాధునిక సాంకేతికత వినియోగానికి ఖర్చుకు వెనుకాడకుండా చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో సేఫ్టీ, వెల్ఫేర్, హెల్త్, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఎక్స్ ప్లొరేషన్, ఎస్టేట్స్, విజిలెన్స్ తదితర 32 డిపార్ట్​మెంట్ల పనితీరుపై సమీక్షించారు. కొత్తగూడెం ఏరియా డైరెక్టర్, సంస్థ డైరెక్టర్ ఆపరేషన్, పర్సనల్ ఎన్ వీకే శ్రీనివాస్, డైరెక్టర్ ఈ అండ్ ఎం సత్యనారాయణ రావు, జీఎం(కో ఆర్డినేషన్) జి.దేవేందర్, కార్పొరేట్ లోని వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు.