- ఎన్నికల బరిలో డాక్టర్లు !
- వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా టికెట్ కోసం ప్రయత్నాలు
- సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉండే ప్రయత్నం
- జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాలపై దృష్టి
జనగామ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండడంతో జనగామ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు చెందిన అధికార, ప్రతిపక్ష లీడర్లు టికెట్ కోసం ఇప్పటి నుంచే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు పలువురు డాక్టర్లు కూడా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకోసం ఓ నాయకులు, మరో వైపు ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు.
మూడు నియోజకవర్గాలు... నలుగురు డాక్టర్లు
జనగామ జిల్లా కేంద్రంలో వైద్య సేవలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న నలుగురు డాక్టర్లు అసెంబ్లీ టికెట్ సాధించడమే టార్గెట్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో జనాలతో మమేకం అవుతున్నారు. నిత్యం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. జనగామ జిల్లా హాస్పిటల్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుగుణాకర్ రాజు స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ ఆశిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ అధికారిగా కొనసాగుతున్నప్పటికీ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ ఆర్థికసాయాలు చేయడం వంటి కార్యక్రమాల జోరు పెంచారు. మరో వైపు ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ కూడా స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ ఆశిస్తున్నారు. కాగా ఇతను కాంగ్రెస్ నుంచి బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇటీవల జిల్లాలో జరిగిన సీఎల్పీ లీడర్మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా కార్యకర్తలను తరలించి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. జిల్లా కేంద్రంలోనే మరో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న మాజీ కర్నల్ మాచర్ల భిక్షపతి సైతం జనగామ నియోజకవర్గం నుంచి చట్టసభలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏ పార్టీ నుంచి టికెట్ దక్కకపోయినా ఇండిపెండెంట్‌గానైనా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం యూత్ మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. మరో ప్రముఖ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ సైతం ఈ సారి పాలకుర్తి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం సరైన క్యాండిడేట్ లేకపోవడంతో అక్కడి నుంచి బరిలోకి దిగాలన్న యోచనలో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం కావడం, ఈయన భార్య గతంలో ఉమ్మడి వరంగల్ జడ్పీచైర్‌పర్సన్‌గా పనిచేయడం తనకు కలిసొస్తుందన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్ల నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు టికెట్ ఇవ్వాలని హైకమాండ్‌ను కోరుతున్నారు.
ఘన్‌పూర్‌లో పోటాపోటీ
ప్రజా సేవలోకి రావాలనుకుంటున్న డాక్టర్లు టికెట్ సాధించడం అంత ఈజీ కాదని పార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని కాదని సుగుణాకర్‌రాజుకు టికెట్ దక్కడం కష్టమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒక వేళ రాజయ్యకు చాన్స్ లేకుంటే కడియం శ్రీహరికి గానీ, ఆయన కూతురు కావ్యకు గాని టికెట్ దక్కుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ సుగుణాకర్ రాజు త్వరలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి తాడో పేడో తేల్చుకుంటానని చెబుతున్నారు. మరో వైపు ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బొల్లేపల్లి కృష్ణ గత ఎన్నికల్లో పోటీ చేసిన సింగపురం ఇందిరకు పోటీగా పావులు కదుపుతున్నారు.
దీనికి తోడు దొమ్మాటి సాంబయ్య కూడా ఇదే నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నారు. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఎవరూ లేకపోవడంతో తనకు టికెట్ ఖాయమని లకావత్ లక్ష్మీనారాయణనాయక్ ధీమాతో ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి ఓ ఎన్‌ఆర్‌ఐని రంగంలోకి దింపాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావును ఢీకొట్టాలంటే అందుకు తగ్గ వారినే రంగంలోకి దింపేందుకు హైకమాండ్ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.