హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్లో నిర్వహించిన ప్రజావాణికి 44 ఫిర్యాదులు వచ్చాయి. అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 22, ట్యాక్స్, ఎఫ్ఏ విభాగాలకు 4 చొప్పున, ఇంజినీరింగ్ (మెయింటెనెన్స్) 3, శానిటేషన్, వెటర్నరీ, ఎస్టేట్స్, హౌసింగ్ విభాగాలకు రెండు ఫిర్యాదుల చొప్పున, ల్యాండ్ అక్విజిషన్, అడ్మిన్, యుబిడి విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి.
అలాగే ఆరు జోన్లలో మొత్తం 86 ఫిర్యాదులు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 45, సికింద్రాబాద్ జోన్ లో 10, శేరిలింగంపల్లి జోన్ లో 20, చార్మినార్ జోన్ లో 6, ఎల్బీనగర్ జోన్ లో 4 రాగా, ఖైరతాబాద్ జోన్ లో ఒక్క ఫిర్యాదు వచ్చింది. ప్రజావాణి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 4 ఫిర్యాదులు రాగా పరిష్కారం నిమిత్తం ఆయా విభాగాలకు పంపించారు.
అసలు ఎందుకు ఇలా..
టౌన్ ప్లానింగ్ కు ప్రతి ప్రజావాణిలో అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ప్రత్యేక దృష్టిపెట్టారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆరా తీశారు. ఫిర్యాదుల స్టేటస్ తెప్పించి, పరిష్కారం అయి వాటితోపాటు పెండిగ్ లో ఉన్న వాటి వివరాలపై ఆరా తీశారు. అయితే, ప్రధానంగా టౌన్ ప్లానింగ్ లో సిబ్బంది కొరత ఉండటం వల్లే ఫిర్యాదుల పరిష్కారం ఆలస్యం అవుతున్నట్లు కమిషనర్ గుర్తించారు. అవసరమైన సిబ్బంది 430 కాగా, ప్రస్తుతం 137 మంది మాత్రమే ఉన్నారు. 200 మంది టీపీఎస్ లు కావాలని సర్కార్ కు నివేదిక పంపారు. దీంతో 60 మందిని త్వరలో ప్రభుత్వం నియమించే అవకాశముంది. సిబ్బంది వచ్చిన తరువాత పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు తెలిసింది.
రంగారెడ్డి కలెక్టరేట్: రంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖ-కు 44, ఇతర శాఖలకు - 18 కలిపి మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో 677 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని ఇచ్చిందని సీపీఎం ఇబ్రహీంపట్నం కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీ ఆధీనంలో ఉన్న ఆ స్థలాలను లబ్ధిదారులకు అందజేయాలని కోరారు.