పెరిగిన జనాభా.. తగ్గిన వనరుల లభ్యత

ఒకప్పుడు సహజంగా దొరికే వనరులతో సాఫీగా సాగిన జన జీవితాల్లో ఇప్పుడు అనేక సమస్యలు మొదలయ్యాయి. టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. జనాభా పెరిగింది. వనరుల లభ్యత తరిగింది. మానవ జీవితంలో ‘ఇంధనం’ విశేష స్థానం ఆక్రమించింది. వంట చేయడానికి, బండ్లు నడవడానికి, విద్యుదుత్పత్తికి, ఇతర అవసరాలకు వాడుతున్న ఇంధనాల వల్ల కాలుష్య కారకాలు పెరిగిపోతున్నాయి. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. కాలుష్యం వల్ల అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఇలాంటి సంక్షోభాన్ని అధిగమించి భవిష్యతరాలను కాలుష్యంలేని, పునురుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లించాలి. బైకులు, లారీలు, బస్సులు, రైల్వేలు, వైమానిక, నావికారంగం ఇలా ఒకటేమిటి సర్వ వ్యవస్థలు ఇంధనం మీదనే నడుస్తున్నాయి.

ఇంధన వనరులు లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో ఊహకందని విషయం. అయితే క్రమేపీ మనం వాడుతున్న ఇంధన వనరులు తరిగిపోవడమే కాకుండా పలు రకాల పర్యావరణ సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల కలుషిత ఉద్గారాల వల్ల గాలి కాలుష్యం, జలకాలుష్యం పెరిగి అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. భూతాపం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచ మంతా ‘గ్లోబల్ వార్మింగ్’ పై గగ్గోలు పెడుతున్నది. చెట్లను నరికి, వాటిని కూడా ఇంధనంగా వాడటం వల్ల గాలి కాలుష్యం ఏర్పడుతోంది. మనం పీల్చే గాలి స్వచ్ఛతను కోల్పోయింది. ఆక్సిజన్ పరిమాణం  తగ్గిపోయింది. జల కాలుష్యం వల్ల తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడానికి తాగునీటిని శుద్ధి చేసే యంత్రాలొచ్చాయి. సమీప భవిష్యత్​లో నీటి శుద్ధి యంత్రాల వలే గాలిశుద్ధి ప్లాంట్లు కూడా ఆవిర్భవించక తప్పదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇంధన వనరుల సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయ వనరుల వాడకం మొదలు పెట్టాల్సిందే.

పొరుగు దేశాలు ఆదర్శం

నార్వే లాంటి దేశాలు ఇప్పటికే పునరుత్పాదక వినియోగ ఇంధనాల(రెన్యూవబుల్ ఎనర్జీ) ను ఉపయోగించి విద్యుదుత్పత్తిని చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆస్ట్రేలియా విద్యుత్ తో నడిచే వాహనాలను పూర్తిగా వాడుకలోకి తెచ్చి, శిలాజ ఇంధనాలైన పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా నడిచే వాహనాలను అరికట్టి, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ లాంటి ఉద్గారాల విడుదలకు కొంతవరకు అడ్డుకట్ట వేసింది. సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగంలో దూకుడుమీదున్న అమెరికా కూడా బయో ఇంధనాలవాడకం పై దృష్టి పెట్టడం ముదావహం. భూతాపం అనేది మిథ్యగా భావించిన అమెరికా కూడా వాస్తవ పరిస్థితులను గమనించడం మంచి పరిణామం. శిలాజ ఇంధనాలు ప్రకృతిసిద్ధంగా ఏర్పడినవే.

బొగ్గు,పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న ప్రపంచం ఈ రకమైన ఇంధన వనరులు పరిసమాప్తమైన తర్వాత కుప్పకూలిపోక తప్పదు. అందుకే అన్నిదేశాలు మొద్దునిద్ర వీడుతున్నాయి. రాబోవు విపత్కర పరిణామాలపై దృష్టి పెడుతున్నాయి. అయితే ఈ కృషి సరిపోదు. ఒక్కసారి వినియోగానికే తప్ప, పునరుత్పత్తికి, పునర్వినియోగానికి పనికిరాని సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించి, సౌరశక్తి, పవన శక్తి, తరంగ శక్తి వంటి కాలుష్య రహితమైన సాంప్రదాయేతర పునురుత్పాదక ఇంధనాలపై దృష్టి సారించాలి. బయో ఇంధనాల వాడకం వల్ల కూడా చాలావరకు హానికర ఉద్గారాల శాతాన్ని తగ్గించవచ్చు. చైనా, ఆస్ట్రేలియా, ఇండియా వంటి దేశాల్లో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. ఖతార్, ఇరాన్, అమెరికా, రష్యా దేశాల్లో సహజ వాయు నిక్షేపాలు అధికం. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను ఊహించి, తరిగిపోయే ఇంధన వనరులను పక్కనబెట్టి కాలుష్యరహిత ఇంధన వనరులపై దృష్టి సారించాలి.

సౌరశక్తి, పవన శక్తిపై దృష్టి పెట్టాలి

భారతదేశంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు, చమురు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికి తీసి ఉత్పత్తి చేయడం తలకుమించిన భారం, వ్యయంతో కూడుకున్న వ్యవహారం. జార్ఖండ్, ఒడిశా, బెంగాల్, తెలంగాణా వంటి రాష్ట్రాల్లో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉండగా, గుజరాత్, అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి. అయినప్పటికీ మన దేశం సౌరశక్తి, వాయుశక్తి ఆధారిత  విద్యుత్ పై ఇప్పుడిప్పుడే దృష్టి కేంద్రీకరించడం శుభపరిణామం. సౌరశక్తిని విద్యుత్ గా మార్చడం శ్రేయస్కరం. పవన శక్తినీ వినియోగంలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఇంధన రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు స్వస్తిచెప్పాలి.

- సుంకవల్లి సత్తిరాజు, సోషల్ ఎనలిస్ట్