
- దేశీయంగా వీటిని ఉత్పత్తి చేసి దేశ స్వయం సమృద్ధికి కృషి చేయాలి: ఎన్.బలరామ్
హైదరాబాద్, వెలుగు: 2070 నాటికి భారత్‌ను కర్బన ఉద్గార రహిత “నెట్ జీరో”దేశంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, ఇది నెరవేరాలంటే క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లో క్రిటికల్ మినరల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. బ్యాటరీ వాహనాలు, సోలార్ పవర్ వినియోగం పెరుగుతున్నందున లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ఖనిజాలకు డిమాండ్ ఏర్పడుతున్నదని తెలిపారు.
క్రిటికల్ మినరల్స్‌లో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వరంగ సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగం, రెనెవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెయికల్స్, డిఫెన్స్ రంగాల్లో క్రిటికల్ మినరల్స్ వినియోగం ఎక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం వీటిని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 30 రకాల కీలక ఖనిజాల జాబితాని విడుదల చేసిందన్నారు.