- ఎన్నికల నేపథ్యంలో ఆదాయం భారీగా పెరిగే ఛాన్స్
- తమకు రాకుంటే గుడ్ విల్ ఇచ్చి తీసుకునేందుకు రెడీ..
- గ్రూపుగా ఏర్పడి దరఖాస్తులు చేసుకుంటున్న ఆశావహులు
ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిమాండ్ ఉన్న వైన్ షాపులను దక్కించుకునేందుకు లిక్కర్ కింగ్స్ ఫోకస్ చేశారు. రెండేండ్ల కోసం నిర్వహించే మద్యం టెండర్లలో అత్యధికంగా అమ్మకాలు జరిగే దుకాణాలు దక్కించుకునేందుకు ఈసారీ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ ఏడాది మొదలుకొని వచ్చే సంవత్సరం వరకు వరుస ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు వైన్స్ టెండర్లు దక్కించుకునేందుకు ఫోకస్ పెడుతున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు రూ. 2 లక్షల ఫీజు ఉండటంతో పాటు ఫీజు నాన్ రిఫరెండ్ కావడంతో కొంత మంది ఆశావహులు ఓ గ్రూపుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఎన్నికలకు కిక్కే..
ఈసారి మద్యం టెండర్లు దక్కించుకున్న వారికి కిక్కే కిక్కు. ఈ రెండేళ్ల సమయంలో వరుస ఎన్నికలు వస్తుండటంతో వ్యాపారులకు కాసుల వర్షం కురవనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది దరఖాస్తులు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఎలాగైన దుకాణాలు దక్కించుకునేందుకు లిక్కర్ వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఏండ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్న లిక్కర్వ్యాపారులు అధిక శాతంతో దుకాణాలు దక్కించుకోవాలనుకుంటున్నారు. ఏ షాపుకైతే తక్కువ దరఖాస్తులు వస్తాయో చివరి రోజు ఆషాప్కు ఒక్కరే రెండు, మూడు దరఖాస్తులు వేసి దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. అయినా అదృష్టం కలిసిరాకపోతే ఎప్పటిలాగానే గుడ్‍విల్ ఇచ్చి చేజిక్కించుకునుందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో గుడ్ విల్ గా రూ. 50 లక్షల నుంచి 70 లక్షల వరకైనా చెల్లిచేందుకు రెడీగా ఉన్నారు.
ఇప్పటివరకు 450 దరఖాస్తులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 192 మద్యం షాపులు ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో 40, మంచిర్యాలలో 73, నిర్మల్ లో 47, ఆసిఫాబాద్ జిల్లాలో 32 దుకాణాలున్నాయి. 2023-25 సంబంధించి ఈనెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం దాదాపు 500 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18 వరకు దరఖాస్తులకు చివరి గడువు కాగా.. 21వ తేదీన ఆయా జిల్లా కేంద్రాల్లో లక్కీ డ్రా ద్వారా దుకాణాలు కేటాయిస్తారు. అయితే గత పాలసీకి సంబంధించి 2021 నవంబర్లో టెండర్లు నిర్వహించగా ఈ సారి ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంతో మూడు నెలలు ముందుగానే టెండర్లు ఆహ్వనించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న షాపుల గడువు నవంబర్ 30తో ముగియనుండగా.. కొత్తగా దక్కించుకున్న వ్యాపారులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది.