జానపద కళలు

తెలంగాణ రాష్ట్రంలో జానపద కళలకు కొదువ లేదు. ఎంతోమంది కళనే కులవృత్తిగా బతికేవాళ్లు. పురాతన కాలం నుంచే మన దగ్గర ఎన్నో కళాకృతులు, నృత్య రూపాలు ఉన్నాయి. మన చరిత్ర, సంస్కృతిని తర్వాత తరాలకు తెలిసేలా చేయడంలో ఈ కళలే కీలకం. అంతేకాదు.. ఒక జాతి నిర్మాణానికి కూడా జానపద కళలు అవసరం. మన దగ్గర దాదాపు వందకు పైగా జానపద కళా రూపాలు ఉన్నాయి. 

ఒగ్గుకథ: తెలంగాణ జానపద కళలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఒగ్గుకథ. ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే ఒగ్గుకథ. తెలంగాణ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన కళారూపం ఇది. ఒగ్గు అనే వాయిద్యం శివుని ఢమరుకాన్ని పోలి ఉంటుంది. పెద్ద డోలు, తాళాలు, ఒగ్గు వాయిద్యాలను వాడి కథ చెప్తుంటారు. నల్లగొండ, వరంగల్, కరీంనగర్​ జిల్లాల్లో ఒగ్గుకథ చెప్పేవాళ్లు ఉన్నారు. ఎక్కువగా గొల్ల, కురమలు ఈ ఒగ్గుకథలు చెప్తారు. బీరప్ప, మల్లన్న, నల్లపోచమ్మ, మాంధాత, కాటమరాజు, ఎల్లమ్మ కథలు చెప్తారు. తలకు రుమాలు చుట్టుకొని, గజ్జెలు కట్టుకొని కథ చెప్తుంటే పక్కనున్న వాయిద్యకారులు లయబద్ధంగా వాయిద్యాలను వాయిస్తూ వంత పాడతారు. 

జముకుల : ఈ కథలు శృంగార, కరుణరసాలతో కూడి ఉంటాయి. చాలా రకాల సంగీతం ఉంటుంది. గ్రామం మధ్యలో చిన్న పందిరి వేసుకుని చెప్తుంటారు. మొత్తం ముగ్గురు కలసి కథ చెప్తుంటారు. 

విప్రవినోదులు: వీళ్ల వృత్తి విప్రులను యాచించడం. మ్యాజిక్​ చేయడం. గ్రామాల చౌరాస్తాల్లోనూ ప్రదర్శనలు ఇస్తారు వీళ్లు. అల్మారా మ్యాజిక్​ చేస్తుంటారు. ఇంటింటికి తిరుగుతున్నప్పుడు అరచేతిలో నుంచి విగ్రహాలు, చిలుకలు, విభూతి సృష్టిస్తారు. 

గొల్లసుద్దులు: గొల్లలనే యాచిస్తారు. యాదవ చరిత్ర, కృష్ణలీలలు, కాటమరాజు కథ చెప్తుంటారు. గొల్లసుద్దుల చెప్పే కథకు సంబంధించిన బొమ్మలను పెద్ద వస్త్రాలపై గీసి, వాటిని చూపిస్తూ.. కథలు చెప్తుంటారు. 

బుడబుక్కల వాళ్లు: సంచార జీవనం చేస్తుంటారు. ఊరూరా తిరుగుతూ ఉంటారు. క్షుద్రదేవతలను పూజిస్తారు. తెల్లవారుజామున విచిత్ర వేషధారణతో ఢమరుకం వాయిస్తూ వీధుల్లో తిరుగుతారు. జ్యోతిషం చెప్తుంటారు. 

బుడగ జంగాలు: వీళ్లు శివభక్తులు. ఒక చేతితో గంట వాయిస్తూ, శివుడి గురించి యక్షగానం చేస్తూ, భిక్షాటన చేస్తారు. జానపద పాటలు పాడుతారు. వీళ్లను ‘జంగమదేవర’ అని కూడా పిలుస్తారు. వీరు వాయించే గంటపై చిన్న ‘నంది’ విగ్రహం ఉంటుంది.

పిట్టల దొర: మన దగ్గర ‘పిట్టల దొర’ కళా ప్రదర్శనకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాకపోతే.. మన దగ్గర పిట్టలదొరను ఎక్కువగా ‘లత్కోర్ సాబ్’, ‘బుడ్డర్ ఖాన్’, ‘తుపాకి రాముడు’ అని పిలుస్తుంటారు. ఇది పగటి వేషాల్లో ఒకటి. సమాజంలోని లోపాలను నవ్వించే విధంగా చెప్తుంటారు. ఖాకీ ప్యాంటు లేదా నిక్కరు, చిరిగిన ఖాకీ షర్టు, తలపై టోపి, కాళ్లకు బూట్లు వేసుకుని చేతిలో కట్టె తుపాకీ పట్టుకుంటారు.

తెలంగాణా వంటకాలు మామూలుగానే కాస్త కారంగా ఉంటాయి. పైగా చింతపండు, నువ్వులు, ఎర్ర మిరపకాయలు లాంటివి ఎక్కువగా వాడతారు. తెలంగాణలో రోటి పచ్చళ్లు, పచ్చిపులుసు, దమ్​ బిర్యానీ, రొట్టెలు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫేమస్ వంటకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని...
 
సర్వపిండి: తెలంగాణ సర్వపిండిని చాలా ప్రాంతాల వాళ్లు ఇష్టపడతారు. బియ్యప్పిండి శనగ పప్పు, పల్లీలు, మిరపకాయలతో చేస్తారు. చూడ్డానికి పాన్‌కేక్​లా ఉంటుంది. ఇది లోతైన, గుండ్రని ఆకారపు పాన్‌లో వండుతారు. ఉడికే ముందు పిండి మీద రంధ్రాలు చేస్తుంటారు. దీన్ని కొన్ని ప్రాంతాల్ల గంజు పిండి, గిన్నె అప్ప, సర్వప్ప అని కూడా పిలుస్తారు. 

మలీద: మన రాష్ట్రంలో ఇది చాలా ఫేమస్​. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ పండుగ రోజు ఈ వంటకం చేస్తారు. ముందుగా చపాతీలుచేసి, వాటిని ముక్కలుగా చేస్తారు. తర్వాత వాటిలో  బెల్లం, జీడిపప్పు, పిస్తా, నెయ్యి కలిపి చిన్న లడ్డూల్లా చేస్తారు. పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారం ఇది. 

సకినాలు: తెలంగాణలో క్రిస్పీ, డీప్ ఫ్రైడ్ స్నాక్స్​ని చాలామంది ఇష్టపడతారు. అందులోనూ  సకినాలు అంటే చాలామందికి ఇష్టం. మామూలు మురుకులతో పోలిస్తే.. ఇది డిఫరెంట్​గా ఉంటుంది. బియ్యం, నువ్వులతో చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో సంక్రాంతి పండుగ సమయంలో చేసుకుంటారు. కొన్ని కుటుంబాల్లో పెండ్లిళ్ల టైంలో కూడా చేస్తారు.  

బిర్యానీ: దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ బిర్యానీకి ఫ్యాన్స్​ ఉన్నారు. ఇండియా అంతటా బిర్యానీ దొరుకుతున్నా వాటిలో హైదరాబాద్​ దమ్​ బిర్యానీ చాలా స్పెషల్​. అందుకే హైదరాబాద్​ దమ్​ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మాంసం, బియ్యంలు హండీలో పొరలు పొరలుగా వేసి వండుతారు.

పచ్చి పులుసు: తెలంగాణలో ఇది చాలా ఫేమస్​. వాస్తవానికి ఇలాంటి వంటకం ఉందని చాలామందికి తెలియదు. ఎందుకంటే.. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా చేసుకుంటారు. నిమిషాల్లో చేయగలిగే వంట ఇది. ఇది రసంలాగే ఉన్నా చేయడంలో చాలా తేడా ఉంటుంది. చింతపండు రసం తీయాలి. తరువాత నూనె వేడిచేసి అందులో పచ్చి మిర్చి, ఎండు మిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి.

శారద కథకులు

తెలంగాణలో జానపద గాయకులుగా జీవనాన్ని కొనసాగించేవాళ్లు శారదకాండ్రు. ‘ఓ భారతీ, కరుణామతీ, భళి శారదకరుణానిధీ..’ అని వంతపాట పాడటంతో వీరికి శారదకాండ్రు అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. వీళ్లు ఉపయోగించే వాయిద్యంలో భుజం మీద ధరించే తంబురాకు ‘శారద’ అని పేరు. శారదను భుజం మీద పెట్టుకుని, తీగలను మీటుతూ మరొక చేతిలో వేళ్ళమధ్యన అందెలను మోగిస్తూ కథ చెప్తుంటారు. వీళ్లు ఎక్కువగా వరంగల్ ప్రాంతంలో ఉన్నారు. బుర్రకథ వాయిద్యకారులు, శారద కథకులకు మధ్య పెద్ద తేడా ఉండదు. బుర్రకథకుల లాగే డక్కీలను వాడతారు. తెలంగాణలో సదాశివరెడ్డి, సర్వాయిపాపన్న, పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ, బొబ్బిలియుద్ధం కథలు చెప్తుంటారు.