జగదేవపూర్, వెలుగు: ఇటీవల ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో బుధవారం చనిపోయింది. అయితే ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుందని అత్తింటి వారు చెబుతుండగా, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఫోక్ సింగర్ శ్రుతి (26)కి, హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు.
వీరి పరిచయం ప్రేమగా మారడంతో 21 రోజుల క్రితం పీర్లపల్లిలో దయాకర్ తల్లిదండ్రులు సత్తమ్మ, భిక్షపతి, కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరు పెండ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి శ్రుతి కుటుంబ సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. బుధవారం పీర్లపల్లిలో బంధువుల ఇంట్లో దశదినకర్మ ఉండడంతో కుటుంబ సభ్యులంతా వెళ్లగా శ్రుతి మాత్రం ఇంట్లోనే ఉంది. కొద్దిసేపటి తర్వాత శృతిని తీసుకెళ్లేందుకు దయాకర్ వచ్చాడు. ఆమె ఉరి వేసుకొని కనిపించడంతో వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి పోలీసులకు చెప్పడంతో గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా శృతిని అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.