జానపద గాయని శృతి జీవితం విషాదాంతం.. ప్రేమ పెళ్లి చేసుకున్న నెల రోజులకే..

జానపద గాయని శృతి జీవితం విషాదాంతం.. ప్రేమ పెళ్లి చేసుకున్న నెల రోజులకే..

సిద్ధిపేట: సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఫ్రెండ్ షిప్, లవ్ అంటూ ఫేస్ బుక్, ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తుల వల్ల ప్రాణాలు పోతున్నాయి. తెలంగాణ జానపద గాయని శృతి జీవితంలో అదే జరిగింది. ఇన్స్టాగ్రాంలో పరిచయమై వ్యక్తితో ప్రేమ ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసింది. గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఎదగాలన్న ఆమె ఆశలను చిదిమేసింది. కలలను కూల్చేసింది. విగత జీవిగా పడి ఉన్న శృతిని చూసి కన్నవాళ్లు కుమిలిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో జానపద గాయని శృతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విషాదం నింపింది. పీర్లపల్లికి చెందిన దయాకర్ అనే వ్యక్తితో ఆమెకు ఇన్ స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో నెల రోజుల క్రితం రహస్యంగా శృతి, దయాకర్ పెళ్లి చేసుకున్నారు. దయాకర్ తన ఇంటికి శృతిని తీసుకెళ్లాడు. ఆమెను కోడలిగా చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో దయాకర్ కుటుంబం నుంచి శృతికి వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు దయాకర్ ఆమెతో సఖ్యంగానే ఉన్నాడు.

ALSO READ | కరెంట్ లేదని కొవ్వొత్తి వెలిగించి పడుకుంది.. నిద్రలోనే సజీవ దహనం అయ్యింది

పట్టుమని పదిహేను రోజులు కూడా కాక ముందే దయాకర్ కూడా తన కుటుంబం మాదిరిగానే శృతితో ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కట్నం తీసుకురాలేదని సూటిపోటి మాటలతో శృతిని దయాకర్, అతని కుటుంబం వేధించింది. పెళ్లైన నెల రోజులకే ఆమెకు నరకం చూపించారు. శృతి అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అత్తారింట్లో అడుగుపెట్టిన నెల రోజుల్లోనే కూతురు విగత జీవిగా కనిపించడంతో ఆమె తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది.

శృతి తాము ఇంట్లో లేని సమయం చూసుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని దయాకర్, అతని కుటుంబ సభ్యులు చెప్పారు. అనుమానాస్పస్థితిలో మృతి చెందడంతో శృతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్న వేధింపుల కారణంగానే హత్య చేసినట్టు ఆమె బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే పలు జానపద పాటలతో శృతి గాయనిగా గుర్తింపు తెచ్చుకుంటున్న  తరుణంలో ఆమె జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం శోచనీయం.