భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు ఆకట్టుకోలేకపోతోంది. బౌలర్లు ఎంతో కొంత రాణిస్తున్నా.. బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ ఒక్కడే మ్యాచ్ ఆడుతున్నట్లు ఉంది. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్ రూపంలో ఐదారుగురు మ్యాచ్ విన్నట్లు జట్టులో ఉన్నా.. ఆట మాత్రం శూన్యం. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ జట్టు ఓటమి పాలైంది. ఇప్పుడు మంగళవారం (జనవరి 28) జరిగే మూడో టీ20లోనూ ఓడితే సిరీస్ చేజారినట్టే.
ఒకవేళ మూడో టీ20లో ఇంగ్లండ్ ఓడింది అనుకుంటే.. సిరీస్ చేజారడం పక్కనపెడితే, మిగిలిన రెండు మ్యాచ్‌లకు విలువుండదు. సిరీస్ విజేత ఎవరనేది తేలిపోయింది కనుక అభిమానుల్లో ఆసక్తి తగ్గుతుంది. ఈ క్రమంలో మూడో టీ20కి ముందు ఇంగ్లండ్ బ్యాటర్లకు భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విలువైన సలహాలు ఇచ్చాడు. వేగంగా పరుగులు చేయాలనే మితిమీరిన దూకుడు తనమే ఇంగ్లండ్‌ను దెబ్బతీస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అటువంటి అద్భుతమైన వ్యూహాలను పక్కనపెట్టి.. తాను చెప్పే చిన్న చిన్న సలహాలు పాటించమని కోరాడు. గెలుపు తప్పక వరిస్తుందని జ్యోతిష్యం చెప్పాడు.
మీరు బెంగళూరు ట్రాఫిక్‌లో ఉన్నారు..
ఇంగ్లండ్ బ్యాటర్ల వ్యూహాన్ని అశ్విన్ బెంగళూరు ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేయడంతో పోల్చాడు. బెంగళూరు ట్రాఫిక్‌లో బండి నడుపుతున్నప్పుడు నాలుగో గేర్‌లో ఉండలేమని అన్నాడు. చుట్టూ వాహనాలు ఉన్నప్పుడు నిదానంగా.. వాహనాలు లేని చోట కాస్త వేగంగా వెళ్లాలని పాఠాలు బోధించాడు. అంతే తప్ప అడ్డొచ్చిన వాహనాలను తొక్కుకుంటూ ముందుకెళ్తామంటే జరగని పనని పంచులు వేశాడు.
ALSO READ | SL vs AUS: ఓపెనర్‌గా హెడ్.. బుమ్రాను చితక్కొట్టినోడిని పక్కన పెట్టారు
‘‘ఇంగ్లండ్ జట్టు అసంపూర్తిగా క్రికెట్ ఆడింది. వరుస తప్పిదాలు చేసింది. భారత్‌లో ఆడుతున్నామన్న సంగతి మరిచారు. ఒక్క టెంపోలో ఆడటం లేదు. బెంగళూరు ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు నాలుగో గేర్‌లో ఉండలేం. ఈ లాజిక్ వారు అనుసరించాలి. దూకుడు అన్ని సమయాల్లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు..” అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో దిశానిర్ధేశం చేశాడు.
అశ్విన్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో ఒక ఇంగ్లిష్ బ్యాటరూ 30 బంతులు ఎదుర్కోలేకపోయాడు.
మంగళవారం (జనవరి 28) నిరంజన్ షా స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 జరగనుంది.