Happy New Year 2025: కొత్త ఏడాదిలో ఈ వెజ్ ఫుడ్ అలవాటు చేసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం.. ఆస్పత్రికి దూరంగా..!

Happy New Year 2025: కొత్త ఏడాదిలో ఈ వెజ్ ఫుడ్ అలవాటు చేసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం.. ఆస్పత్రికి దూరంగా..!

కొత్త ఏడాదిలో అడుగు పెట్టబోతున్నాం.. ఇకనైనా పాత అలవాట్లకు ముగింపు పలికి కొత్త అలవాట్లను స్వాగతిద్దాం.. ఆరోగ్యంగా ఉందాం.. అసలే ఎప్పుడు, ఏ మహమ్మారి ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేకున్నాం. శరీరానికి అవసరమైన మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని తిని నలుగురికి ప్రేరణగా నిలుద్దాం..  

మన శరీరానికి ప్రొటీన్లు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. వీటివల్ల శరీర నిర్మాణం క్రమ పద్ధతిలో జరుగుతుంది. కొత్త కణాలు నిర్మితమవుతాయి. కండరాలకు బలం, శక్తితో పాటు ఎముకలు దృఢాన్నిస్తాయి. కాబట్టి నిత్యం ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. అయితే, కొంతమంది. మాంసాహారం తినలేరు. దీని వల్ల తమకు ప్రొటీన్లు ఎలా అందుతాయనే ఆందోళన వాళ్లలో ఉంటుంది. అలాంటి వాళ్లు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మాంసాహారం కన్నా ఎక్కువగా ప్రొటీన్లు పొందొచ్చు. మరి ఆ వెజిటేరియన్ ఫుడ్ ఏంటో చూడండి..

కీన్ వా

కీన్ వా చిరుధాన్యాల జాతికి చెందింది. చూసేందుకు సజ్జల్లా ఉండే కీన్ వా లో ప్రొటీన్లు చాలా ఎక్కువ. ఈ గింజలు ప్రస్తుతం మార్కెట్ లో బాగా దొరుకుతున్నాయి. వీటిని రోజూ తినడం వల్ల శరీరానికి కావాల్సినన్ని ప్రొటీన్లు లభిస్తాయి. అదేవిధంగా తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు కూడా శరీరానికి అందుతాయి. కీన్ వా గింజలు బ్లడ్ షుగర్ ని అదుపు చేస్తాయి. మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మెటబాలిజం మెరుగవు తుంది. అధికబరువు కూడా తగ్గుతారు.

పన్నీర్

పాలతో తయారు చేసే పన్నీర్లో ప్రొటీన్లు పుష్కలం. మాంసాహారం తినని వాళ్లకు పన్నీర్ మంచి ఆహారం పోషకాలు కూడా లభిస్తాయి. అయితే, కొవ్వు తక్కువగా ఉండే పన్నీర్ తింటే మరీ మంచిది.

Also Read : రోజుకు 3, 4 పిస్తాలు తినండి

పప్పులు, చిక్కుడు జాతి గింజలు

పెసలు, కందిపప్పు, శెనగపప్పు లాంటి పప్పు ధాన్యాలు.. చిక్కుడు, రాజ్మా, సోయా, బఠానీ వంటి చిక్కుడు జాతి గింజల్లోనూ ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, ఫొలేట్ (బి.కాంప్లెక్స్ ఉండే పదార్థం). జింక్ లాంటి ఖనిజ లవణాలు కూడా వీటిల్లో ఉంటాయి. శరీరానికి కావాల్సినన్ని ప్రొటీన్లు ఈ గింజలతో అందుతాయి. శరీర నిర్మాణం సరిగ్గా జరుగుతుంది.

పాలు

రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల కొవ్వు తీసిన పాలను తాగినా చాలు. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి. పాలు అందరికీ అందుబాటులో ఉండే సంపూర్ణ పౌష్టికాహారం. పాల వల్ల కండరాలు దృఢంగా మారతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి.

నట్స్

జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నాట్స్ .. లాంటి నట్స్ తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, మాంగనీస్, విటమిన్- ఈ సమృద్ధిగా లభిస్తాయి. అవి శరీర నిర్మాణానికి ఉపయోగ పడతాయి. ఎదుగుతున్న పిల్లలకు చాలా మేలు చేస్తాయి.