- యాదగిరిగుట్టలో మీటింగ్
- షెడ్యూల్ వరకు వేచి చూసి.. తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
యాదాద్రి, వెలుగు: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు ఎమ్మెల్యే టికెట్ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న మోత్కుపల్లికి బీఆర్ఎస్ హైకమాండ్ టికెట్ ఇవ్వకపోవడం సరికాదని వారన్నారు. ఇప్పటికైనా సీఎం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడినుంచైనా టికెట్ కేటాయించాలని కోరారు. గురువారం యాదగిరిగుట్టలో మోత్కుపల్లి ముఖ్య అనుచరులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు కేసీఆర్ పేరుతో లెటర్ రిలీజ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేదాకా చూస్తామని, టికెట్కేటాయించకపోతే తమ నేత ప్రత్యామ్నాయం ఆలోచిస్తారని స్పష్టం చేశారు.
లిస్టులో పేరు లేకపోవడంతో నిరాశ..
మోత్కుపల్లి 2021లో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆహ్వానం మేరకే బీఆర్ఎస్ చేరానని ఆయన చెప్పుకున్నారు. కేసీఆర్ కూడా ఆయనకు మొదట్లో గౌరవం ఇచ్చారు. ఆ సమయంలోనే దళితబంధు స్కీమ్ చైర్మన్పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత మోత్కుపల్లికి సీఎం అపాయింట్మెంట్ కూడా లభించలేదు. ఎలాంటి నామినేటేడ్ పదవీ దక్కలేదు. పార్టీలోనూ పెద్దగా పట్టించుకోక పోవడంతో మోత్కుపల్లి తీవ్ర అసహనానికి గురయ్యారు.
సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో ఆలేరు సహా ఎక్కడి నుంచి మోత్కుపల్లికి టికెట్ఇవ్వలేదు. దీంతో నిరాశకు లోనయ్యారు. టికెట్ విష యంలో మాటమాత్రం చెప్పకపోవడంపైనే ఆయనను తీవ్రంగా బాధించిందని సన్నిహితులు పేర్కొంటున్నారు. జరిగిన అవమానంపై సన్నిహితుల వద్ద మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనని చెప్పినట్టు సమాచారం.