సత్తుపల్లి/మధిర, వెలుగు: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్పాలేరు టికెట్దక్కకపోవడం బాధాకరమని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల తుమ్మల అనుచరులు బుధవారం సత్తుపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 14 ఏండ్లు మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడం ఆయన అనుచరులుగా జీర్ణించుకోలేకపోతున్నామన్నారు.
తుమ్మలతోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిందని, ఆయన వచ్చాకే బీఆర్ఎస్ బలపడిందన్నారు. గత ఎన్నికల్లో కొంత మంది కారణంగా ఓడిపోయి తీవ్రంగా నష్టపోయామని, అవమానాలు పడుతూనే తుమ్మల ప్రయాణం సాగించారని గుర్తుచేశారు. కొంతమంది కాంగ్రెస్ కు పోదామని, మరి కొంతమంది బీజేపీలో చేరుదామని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ కూసంపుడి నరసింహారావు, చలసాని సాంబశివరావు, చల్లగండ్ల నరసింహారావు, అత్తులూరి రంగారెడ్డి, కొత్తూరు ప్రభాకర్ రావు, రాచూరి గంగరాజు, జేష్ట అప్పారావు, నున్న రత్నాకర్ రావు, వేల్ది జగన్ మోహన్ రావు, ఇస్సంపల్లి వెంకటేశ్వరరావు, వెలిశాల చెన్నాచారి తదితరులు పాల్గొన్నారు.
అలాగే మధిరలోని చెరుకూరి నాగార్జున ఇంట్లో బుధవారం బీఆర్ఎస్నాయకులు, తుమ్మల అనుచరులు సమావేశమయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని, ఆయన బాటలోనే నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. తుమ్మలకు పాలేరు టికెట్ దక్కకపోవడంపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు. సమావేశంలో నాయకులు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, మొండితోక సుధాకర్ రావు, మాదల రామారావు, గద్దల కిరణ్, చటారి ప్రసాద్, స్వామి తదితరులు పాల్గొన్నారు.