అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడి పెద్దలు చెప్పిన మాట. ఆరోగ్యకరమైన పదార్థాలు ఆరోగ్యకరమైన వంట విధానాలకు ప్రపంచంలోనే పేరొందిన దేశం భారతదేశం. అందులోనూ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు నగరం ఆహార సంస్కృతి, రుచికరమైన వంటకాలు చరిత్రను కలిగి ఉంది.
గొప్ప సంప్రదాయాలను కలిగిన భోజన ప్రియుల స్వర్గధామంగా వెలుగొందింది అనటంలో అతిశయోక్తి లేదు. ఇది మొగల్కాలం నుంచి సాంస్కృతిక సామాజిక పరిణామాలపై ఎంతగానో ప్రభావం చూపుతూ, ప్రపంచవ్యాప్తంగా విభిన్న భోజన ప్రియులను భారతదేశం ఆకర్షిస్తోంది. దక్కన్ సంస్కృతి, ఆధునిక జీవనశైలి కలయిక ఈ నగరంలోని వంటకాలకుప్రత్యేకమైన ఆకర్షణను ఇచ్చింది.
నేటికీ బిరియానీ, హలీం వంటి వంటకాలతోపాటు బేకరీలలో తయారయ్యే ఉత్పత్తులు, మిఠాయిలు ఈ నగరానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును ఇస్తున్నాయి. నేడు మారుతున్న జీవన విధానం, పోటీ ప్రపంచంలో హోటళ్లలో భోజనం చేయడం సర్వసాధారణంగా జరుగుతున్నది.
ఈ మార్పును అవకాశంగా చేసుకొని అనేకమంది వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించడం కోసం వంట పదార్థాలలో అనేక రకాల విషతుల్య రసాయన ద్రవ్యాలు లేదా వివిధ రకాల పొడులను వంటకాలలో రుచి కోసం, ఆకర్షణీయమైన రంగుల కోసం వాడుతున్నారు. ఇంత గొప్ప మహాచరిత్ర కలిగిన నగరానికి నేడు కల్తీలతో చెడ్డపేరు వస్తున్నది.
పరిశుభ్రత లోపించడంతోనే ఫుడ్ పాయిజన్
కేవలం రెస్టారెంట్లు, హోటళ్లలోనే కాకుండా గత రెండు సంవత్సరాలలో తెలంగాణలో విద్యాసంస్థలు ప్రభుత్వ గృహాలలో కూడా అనేక ఫుడ్ పాయిజన్ కేసులు నిరంతరం వార్తల ప్రధాన శీర్షికల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు 2022 ఆగస్టు, సెప్టెంబర్ మధ్య తెలంగాణలో 900కు పైగా విద్యార్థులు ఆహారం వికటించి ఆసుపత్రులపాలు అయ్యారు. ఈ మధ్యకాలంలోనే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కలుషితమైన ఆహారం తిని 40 మంది బాలుర్లు, 16 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
అంతేకాకుండా ఇటీవలనే పదహారేండ్ల ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థిని కలుషితమైన ఆహారం తిని మృతి చెందింది. విద్యార్థులకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యత కనిష్ట స్థాయికి పడిపోయి, అనారోగ్యాలకు నేలలుగా మారిపోయింది. ఈ ఒక్క సంవత్సరమే రాష్ట్రంలో దాదాపు 402 కలుషిత ఆహార ఘటనలు నమోదు అయిన ట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా వంట గదిలో పరిశుభ్రతను పాటించకపోవడంతో ఎలుకలు, బొద్దింకలు ఇలాంటివి ఆహార పదార్థాలలో కలిసిపోయి అనారోగ్యానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. గొప్ప పేరు, ప్రఖ్యాతులు ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లులో సైతం ఆహారం కల్తీ జరుగుతోందని ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాల్లో తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
రసాయనాలతో ఆరోగ్యానికి హాని
పండ్లను కృత్రిమంగా పచ్చగా చేసేందుకు, ఆహారాన్ని నిలుపుకోవడానికి రసాయనాలు వాడటం అనేది అనేకసార్లు జరుగుతోంది. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమైనవి. ప్రభుత్వ స్థాయిలో ఆహార నిబంధనలు అనుసరించడంలో అనేక లోపాలు ఉన్నాయి.
నగరంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కనీసం 30 మందితో నగరాన్ని పర్యవేక్షించడం చాలా కష్టం. ఈ ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీడియా, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఆహార కలుషితాన్ని గుర్తించడానికి, దీనివల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
పండ్లు, కూరగాయలను కృత్రిమంగా పచ్చగా చేసేందుకు ఉపయోగించే రసాయనాల ప్రమాదాలను ప్రత్యేకంగా పరిగణించాలి. ఆహార భద్రతపై సరైన పర్యవేక్షణ లేకపో డంతో ఈ సమస్య మరింత పెరుగుతోంది.ఇటు హోటళ్లు, విద్యాసంస్థలలో సరైన పరిశుభ్రత లేకపోవడం, వంట సామగ్రిని అశాస్త్రీయ పద్ధతుల్లో నిలువ చేయటం, వ్యాపారం వృద్ధి చేయడం కోసం అనేక రకాలైన హానికరమైన కెమికల్స్ వంటల్లో ఉపయోగించడం కూడా ఓ కారణంగా కనపడుతున్నది.
హోటళ్లలో లేదా ప్రభుత్వ గృహాలు, హాస్టళ్లలో ఉన్నవారు భోజనం చేయాలంటేనే బెంబేలెత్తేపరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉన్నది. ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాణాలను పాటించని రెస్టారెంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ప్రజలు కోరుతున్నారు. ఈ నివేదికతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఆహార కల్తీని అరికట్టాలి
ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒకచోట ఘటనలు జరుగుతున్నప్పటికీ కఠినమైన చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పట్టణ ప్రాంతాలలో ప్రతిగల్లీకి మొబైల్ ఫుడ్ కోర్టులు లేదా చిన్న, పెద్ద హోటల్లో ఫుడ్ బిజినెస్ జరుగుతున్నది. అయితే, ఆహార పదార్థాలలో, వండిన వంటల్లో నాణ్యత లేకపోవడంతో ప్రజల ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
కాబట్టి, ప్రభుత్వం ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు, తయారీదారులు, పంపిణీదారులు పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తక్షణమే ఫుడ్ సేఫ్టీ అధికారులను పెద్ద ఎత్తున నియమించుకొని హోటళ్లు, విద్యాసంస్థల్లో ఆహార నాణ్యతలు పరిశీలించి తగు విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా అనవసరమైన ఆర్థిక భారాన్ని కూడా ప్రజలకు తగ్గించవచ్చు. దేశవ్యాప్తంగా ఆహార కల్తీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఎన్సీఆర్బీ గణాంకాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని నివేదిక పేర్కొంది.
- చిట్టెడి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్సీయూ-