వనపర్తి టౌన్, వెలుగు : వనపర్తి మండలం కిష్టగిరి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బంద్ అయింది. ఈ స్కూల్ లో ఒకటి నుంచి ఏడు తరగతులు ఉన్నా విద్యార్థుల సంఖ్య మాత్రం 50 లోపే ఉంది. ఏటా బడిబాట తదితర కార్యక్రమాలను విద్యా శాఖ నిర్వహిస్తోంది. అయినా స్కూల్ లో స్టూడెంట్ల సంఖ్యను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానంగా ఈ ఏడాది ప్రారంభం నుంచే బడిలో మిడ్ డే మీల్స్ కార్యక్రమం బంద్ పెట్టారు.
దీంతో విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకొని తింటున్నారు. మధ్యాహ్న భోజనం స్టూడెంట్లకు అందకపోవడంపై వనపర్తి ఎంఈఓ, డీఈఓ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కిష్టగిరి యూపీఎస్‌లో మిడ్డే మీల్స్ అందించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై హెచ్ఎం స్వామిని వివరణ కోరగా, స్కూల్ లో మధ్యాహ్న భోజనం అమలు కాని విషయం నిజమేనని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. స్టూడెంట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీలు ముందుకు రావడం లేదని హెచ్ఎం వెల్లడించారు.