ఒడిశాలో ఫుడ్ ఏటీఎం

ఒడిశాలో ఫుడ్ ఏటీఎం

సంబల్‌పూర్‌లో తృప్తిపేరుతో స్టార్ట్‌

ఉన్నోళ్లు.. తిండి ఎక్కువై పారేస్తుంటరు. లేనోళ్లు.. నీళ్లు తాగి ఆకలిని చల్లార్చుకుంటుంటరు. అందుకే.. ఉన్నోళ్లు మిగిలిన తిండిని తెచ్చి పెట్టేందుకు, లేనోళ్లు అక్కడి నుంచి తీసుకెళ్లి కడుపు నింపుకొనేందుకు పెద్ద పెద్ద నగరాల్లో ఫుడ్ ఏటీఎం లు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒడిశాలోని సంబల్‌పూర్ నగరంలో మంగళవారం మొదటి ఫుడ్ ఏటీఎంను లోకల్ అధికారులు ప్రారంభించారు. ‘తృప్తి’ అనే పేరు పెట్టిన ఈ ఫుడ్ ఏటీఎంను ‘స్వేచ్ఛ’ అనే లోకల్ ఎన్జీవో, సంబల్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కలిసి ఏర్పాటు చేశాయి. ఫంక్షన్లలో లేదా ఇండ్లలో మిగిలిపోయే ఆహారాన్ని ఇక్కడికి తెచ్చి పెట్టాలని స్థానికంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ 700 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్రిజ్ ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఏటీఎంను మున్సిపాలిటీ, ఎన్జీవో కార్యకర్తలు సంయుక్తంగా నిర్వహిస్తారు. ఆహారం క్వాలిటీని ఫుడ్ ఇన్ స్పెక్టర్లు తరచూ తనిఖీ చేస్తారు. ఇందులో వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే పెట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రోజూ ఉందయం 7 నుంచి రాత్రి 10 వరకూ దీనిని తెరిచి  ఉంచుతామని వెల్లడించారు.  ఈ నెల 6న ఒడిశాలోని కుచింద సిటీలో కూడా ఒక ఫుడ్ ఏటీఎం ప్రారంభమైంది. హైదరాబాద్ లోనూ ఇదివరకే ‘ఫీడ్ ద నీడ్’ పేరుతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫుడ్ ను ఉంచేందుకు రోడ్ల పక్కన ఫ్రిజ్ లను ఏర్పాటు చేశారు.

Food ATM opens up in Odisha to provide free eatables to poor