- కేఎఫ్‌సీతో సహా అన్నింటిలోనూ కల్తీ ఆయిల్ వాడకం
- మిర్యాలగూడ, నల్గొండలో తనిఖీలు చేసిన ఆఫీసర్లు
- రెండు నెలల్లో 6 రెస్టారెంట్లపై కేసులు నమోదు
నల్గొండ, వెలుగు : జిల్లాలోని ఫుడ్‌కోర్టులు, బిర్యానీ రెస్టారెంట్లు కల్తీకి కేరాఫ్‌గా మారాయి. నాన్‌వెజ్ బిర్యానీ, ఇతర ఫుడ్ఐటమ్స్లో కల్తీ నూనె వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. జిల్లా ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇటీవల వరుసగా చేసిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. వాడిన ఆయిల్‌నే మళ్లీ మళ్లీ వాడడం వల్ల వాటిల్లో క్యాన్సర్ కారక కెమికల్స్ పేరుకుపోయినట్లు టెస్టుల్లో తేలింది. దీంతో కొన్ని హోటల్స్ పైన క్రిమినల్ కేసులు ఫైల్ చేయగా, మరికొన్ని రెస్టారెంట్లు, సినిమా థియేటర్స్‌లో నడిపించే క్యాంటీన్లకు భారీ పెనాల్టీలు విధించారు.
మెయిన్ రెస్టారెంట్లలో ఫుల్ కల్తీ..
గడిచిన రెండు, మూడు నెలల్లో నల్గొండ, మిర్యాలగూడ పట్టణాల్లోని పేరొందిన రెస్టారెంట్లు, హోటల్స్, మండీ బిర్యానీ సెంటర్లు, సినిమా థియేటర్ల క్యాంటీన్లో ఫుడ్ ఐటమ్స్‌ను ఆఫీసర్లు తనిఖీ చేశారు. మిర్యాలగూడలోని రెడ్డి మెస్, నల్ల మిరియాలు రెస్టారెంట్లలో వాడిన ఆయిల్స్‌లో కల్తీ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఈ రెండింటి పైన క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. నల్గొండలోని హవేలీ, హరిత, వెంకటేశ్వర, దావత్, కృతుంగ, నటరాజ్ థియేటర్లోని క్యాంటిన్లో వినియోగించే ఆయిల్స్‌ను పరీక్షించారు. వీటిల్లో హరిత, హవేలి, దావత్ రెస్టారెంట్లు, నటరాజ్ థియేటర్ క్యాం టిన్ పైన కాంపౌండ్ కేసులు ఫైల్ చేశారు. ఒక్కో రెస్టారెంట్ పైన రూ.5 లక్షల వరకు ఫైన్విధిస్తారు. గతేడాది వివిధ రకాల రెస్టారెంట్లు, హోటల్స్, ఇతర వ్యాపార సంస్థలన్నింటిలో కలిపి 17కు పైగా కేసులు ఫైల్ చే సినట్లు అధికారులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ కోర్టులో కేసులు పరిశీలనలో ఉన్నాయని, త్వరలో అన్నింటిపైన ఫైన్ వేస్తామని అధికారులు తెలిపారు.
క్యాన్సర్ కారక రసాయనాలు..
ఫుడ్‌సేఫ్టీ రూల్స్ ప్రకారం ఒక్కసారి వినియోగించే ఆయిల్లో టోటల్ పోలార్ కౌంట్( టీపీసీ) 20 నుంచి 25 శాతం ఉంటుంది. అదే ఆయిల్‌ను మోతాదుకు మించి అనేక సార్లు వినియోగిస్తే దాంట్లో పోలార్ కౌంట్ పరిధి దాటిపోతుంది. ఇలాంటి నూనెలు వాడటం వల్ల వాటిపైన క్యాన్సర్ కారక రసాయనాలు పేరుకుపోతాయి. సోమవారం నల్గొండ టౌన్‌లోని కేఎఫ్సీలో ఫుడ్‌సెక్యూరిటీ ఆఫీసర్లు తనిఖీ చేయగా కల్తీ ఆయిల్‌తో ఫ్రైడ్ చికెన్, ఫ్రైస్ ఇంకా వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. వెంటనే వంట నూనెల శాంపిల్స్‌ను పరిశీలించగా వాటిలో టోటల్ పోలార్ కౌంట్( టీపీసీ) వాల్యూ 38 శాతానికి దాటింది. ఒకసారి వాడిన ఆయిల్‌నే మళ్లీ వాడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. సేకరించిన శాంపిల్స్ హైదరాబాద్‌లోని ఫుడ్ ల్యాబ్ పంపించారు. రిపోర్ట్ రాగానే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామని జిల్లా ఇన్చార్జి అధికారి స్వాతి చెప్పారు.