టార్గెట్ రీచ్ కాలేక ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు

టార్గెట్ రీచ్ కాలేక ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు

హైదరాబాద్, వెలుగు: కంపెనీలు పెడుతున్న టార్గెట్ రీచ్ ​కాలేక రోజుకు 17 నుంచి 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని సిటీలోని ఫుడ్​డెలివరీ బాయ్స్ వాపోతున్నారు. అప్పటికీ టార్గెట్​పూర్తవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా అప్పటి నుంచి గ్రేటర్ లో టేక్‌‌‌‌ అవేలు భారీగా పెరిగాయి. వందల మంది పార్ట్‌‌‌‌టైం, ఫుల్ టైంగా ఫుడ్, గ్రోసరీ డెలివరీని తమ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. గతంలో ఒక్కో ఏరియాలో 200 మంది డెలివరీ బాయ్స్​ఉంటే ఇప్పుడు 600 మందికి పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డెలివరీ కంపెనీలు వర్కర్ల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కొత్తగా జాయిన్​అయ్యేవారు డైలీ పెరుగుతుండడంతో ఉన్నవారిని తీసేస్తూ పోతున్నాయి. ఆర్డర్‌‌‌‌‌‌‌‌కి ఇచ్చే అమౌంట్ ను తగ్గిస్తూ, ఇన్సెంటివ్ లను ఆలస్యంగా వేస్తున్నాయి. డైలీ 15 వందల మంది కొత్తగా జాయిన్ అవుతుంటే, అంతకు మించి తొలగిస్తున్నారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌‌‌ఫాం వర్కర్స్ యూనియన్ ఫౌండర్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఈ ఫీల్డ్​లో పార్ట్ టైం వర్కర్లు పెరగడంతో ఫుల్​టైం చేసేవారికి ఇబ్బందిగా మారిందన్నారు. అయితే తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని డెలివరీ బాయ్స్​వాపోతున్నారు. 

ఎంత దూరమైనా రూ.20 నుంచి 25

2021 నుంచి ఆర్డర్​కి ఇచ్చే చార్జీలు పెంచాలని నిరసనలు చేస్తున్నా కంపెనీలు పట్టించుకోవడం లేదని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. పెట్రోల్‌‌‌‌ ధరలు భారీగా పెరిగినా ఇచ్చే చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 4 కిలోమీటర్లు డెలివరీ చేసినా, 10 కిలోమీటర్లు చేసినా రూ.20 నుంచి 25కు మించి ఇవ్వడం లేదని చెబుతున్నారు. కనీస చార్జీని రూ.35కు పెంచాలని , డోర్‌‌‌‌ స్టెప్‌‌‌‌ డెలివరీకి రూ.5 ఇవ్వాలని, కిలోమీటర్‌‌‌‌కు చెల్లించే మొత్తాన్ని రూ.6 నుంచి రూ.12కు పెంచాలని కోరుతున్నారు. బయట జాబ్స్​ దొరకక.. తప్పనిసరి పరిస్థితిలో ఉపాధి కోసం ఈ ఫీల్డ్‌‌‌‌లోకి వచ్చామని చాలా మంది చెబుతున్నారు. ఈఎంఐ
లపై బైక్​లను కొనుక్కొని ఫుడ్​ డెలివరీ చేస్తున్నామని, ప్రస్తుతం ఆర్డర్లు బాగా తగ్గడంతో ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తోందంటున్నారు. కంపెనీలు ఇస్తున్న మొత్తంలో సగానికి పైగా పెట్రోలుకే పోతుందని చెబుతున్నారు. గతంలో ప్రతి 15 నిమిషాలకోసారి రెండు నుంచి మూడు కిలో మీటర్ల  దూరంలో ఆర్డర్లు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. డెలివరీ ఇవ్వాలన్న తొందరలో కొన్నిసార్లు ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తున్నామని, ఫలితంగా ట్రాఫిక్​చలాన్లు కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు గోల్డ్, సిల్వర్ అనే స్కీమ్‌‌‌‌లు పెట్టి ఆగం చేస్తున్నాయని షేక్ సలావుద్దీన్ చెప్పారు.


ఎవరికి ఫిర్యాదు చేయాలి

4 కిలోమీటర్ల లోపు డెలివరీలు చేస్తే ఆర్డర్ కి రూ.35 ఉంటే దాన్ని రూ.20కు కుదించారు. 10 నుంచి 15 కిలోమీటర్లలోపు డెలివరీ చేసినా అదే అమౌంట్​ ఇస్తున్నారు. ఐడీలు బ్లాక్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఆన్‌‌‌‌లైన్ ఫుడ్ కంపెనీ 2 వేల మంది ఐడీలను బ్లాక్ చేసింది. డెలివరీ వర్కర్ల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదు. వీళ్ల కోసం ఒక చట్టం తీసుకురావాలి. 
– షేక్ సలావుద్దీన్, వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్​ఫాం వర్కర్స్ యూనియన్

చార్జీలు పెంచాలి

నేను ఫుల్ టైం డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాను. గతంలో ఆర్డర్లు బాగానే వస్తుండేవి. ఇప్పుడు ఎంత వెయిట్ చేసినా రావట్లేదు. ఎన్ని కిలోమీటర్లు పోయి డెలివర్ చేస్తున్నా చార్జీలు పెంచడం లేదు. లాంగ్ ఆర్డర్లు వరుసగా మూడు క్యాన్సిల్ చేస్తే రోజంతా యాప్ ఓపెన్ కాదు. రోజుకి 1200 వస్తే అందులో ఐదారు వందలు పెట్రోల్‌‌‌‌కి పోతున్నాయి. చార్జీలు పెంచితే బాగుంటుంది. 
– వెంకటేషన్, డెలివరీ బాయ్, స్విగ్గీ