
హనుమకొండ, వెలుగు : హనుమకొండ నగరంలోని కిషన్‌పురలో ఉన్న ఆర్డీ జూనియర్ కాలేజీలో గురువారం ఫుడ్ ఫాయిజన్ జరిగింది. పేరెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్డీ కాలేజీలో ఇంటర్ చదువుతున్న 26 మంది విద్యార్థినులు గురువారం మధ్యాహ్నం భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ సిబ్బంది వారిని వెంటనే గుట్టుచప్పుడు కాకుండా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించారు.
శుక్రవారం ఉదయం విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాలేజీకి చేరుకున్న పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పిల్లల ప్రాణాల మీదకు వచ్చినా, సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం పేరెంట్స్ కు సర్ది చెప్పి ఇండ్లకు పంపించినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు.
ఈ విషయమై కాలేజీ డైరెక్టర్ మల్లేశంను వివరణ కోరగా.. ఫుడ్ పాయిజన్ జరగలేదని, నలుగురు స్టూడెంట్లు ఇబ్బందికి గురైతే వారిని ఆసుపత్రిలో చూపించినట్లు తెలిపారు.