జగిత్యాల, వెలుగు: ధర్మపురి మైనార్టీ గురుకుల కాలేజీలో శుక్రవారం భోజనం వికటించి ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కొద్దిసేపటి తర్వాత ఇంటర్ స్టూడెంట్స్ జుహా, నందిని, కీర్తిమని, ఉమేరియా, శ్రావ్య తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. హుటాహుటిన కాలేజీ యాజమాన్యం వారిని ధర్మపురి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.
సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హాస్పిటల్‌కు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం వారిని రెండు అంబులెన్సుల్లో జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయమై విప్ అడ్లూరి మాట్లాడుతూ ఉడికి ఉడకని అన్నం తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు చెబుతున్నారన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.