గొల్లపల్లి ప్రైమరీ స్కూల్​లో ఫుడ్ పాయిజన్

  • 30 మంది విద్యార్థులకు అస్వస్థత
  • ఏరియా దవాఖానలో విద్యార్థులకు చికిత్స  
  • సంపు వాటర్​తో  వంట చేయడమే కారణమన్న హెచ్ఎం

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి ప్రైమరీ స్కూల్ లో శుక్రవారం ఫుడ్ పాయిజన్ తో 30 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక స్కూల్​లో మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. భోజనం తిన్న గంట సేపటికే  విద్యార్థులకు వాంతులు మొదలయ్యాయి. మొదట ఏడుగురు వాంతులు చేసుకోగా, కొద్దిసేపటికే మరో 23 మంది వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అందరినీ సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు.  

వంటకు సంపు నీళ్లు వాడడంతోనే.. 

గొల్లపల్లి ప్రైమరీ స్కూల్​లో మధ్యాహ్న భోజనం వండేందుకు సంపు వాటర్ ఉపయోగిస్తున్నారు. తాగడానికి బోరు నీళ్లను వాడుతున్నారు. ‘మన ఊరు మన బడి’ పథకంలో భాగంగా కొన్ని రోజుల నుంచి రినోవేషన్ పనులు జరుగుతున్నాయి. దీంతో సిమెంట్, దుమ్ముతో బోరు సంపు వాటర్ ​కలుషితమైంది. ఈ నీళ్లతోనే వంట చేయడంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందని  హెచ్ఎం పాపయ్య తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించామని డీఈవో రాధాకిషన్ చెప్పారు. సంపు వాటరే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పరిశీలిస్తున్నామన్నారు.  డీఎంహెచ్ఓ డా. సుమన్ ​మోహన్ రావు మాట్లాడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు.  

పురుగులన్నం పెడుతున్రు

గొల్లపల్లి ప్రైమరీ స్కూల్​లో నా కొడుకు 5వ తరగతి చదువుతున్నడు. మధ్యాహ్న భోజనంలో పురుగులన్నం పెట్టడం వల్ల వానికి వాంతులైనయ్. బడిని శుభ్రంగా ఉంచుతలేరు. కూరగాయలు, అన్నంలో పురుగులుంటే అట్లనే పెడుతున్నరు. దీని గురించి విద్యాకమిటీకి,హెచ్ఎంకు ఇంతకుముందే చెప్పినా. అయినా పట్టించుకోలే. 

-  సత్తయ్య, ఓ విద్యార్థి తండ్రి