ఆత్మకూర్/వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి 58 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి స్టూడెంట్లు వంకాయ కూర, సాంబార్‌తో భోజనం చేసి పడుకున్నారు. అర్ధరాత్రి నుంచి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్రంగా అవస్థపడ్డారు. శుక్రవారం ఉదయం స్టూడెంట్లను ఆత్మకూర్గవర్నమెంట్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో 12మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వనపర్తి జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.
సమాచారం అందుకున్న పేరెంట్స్ ఆస్పత్రులకు తరలివచ్చారు. ఆత్మకూరు ఆస్పత్రిలో ట్రీట్మెంట్పొందిన 46 మంది స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగవడంతో శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. వనపర్తి జిల్లా హాస్పిటల్ లో చికిత్స పొందున్న 12 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇన్చార్జ్ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ శ్రీనివాసులు చెప్పారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆర్డీవో పద్మజ, అమరచింత, ఆత్మకూర్ మున్సిపల్ చైర్ పర్సన్లు గాయత్రి, మంగమ్మ స్టూడెంట్లను పరామర్శించారు.
కలుషిత ఆహారం పెట్టడం వల్లే స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ ప్రతినిధులు ఆత్మకూర్, అమరచింత పట్టణాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. వనపర్తి జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న స్టూడెంట్లను కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ పరామర్శించారు. ఘటనపై సీరియస్ అయిన కలెక్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎస్వో స్వప్న రాణిని సస్పెండ్ చేశారు. అలాగే డీఈవో గోవిందరాజుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.